కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ
కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన 
సంయుక్త కార్మిక కమిషనర్ ఆర్.చంద్రశేఖరంకు డిమాండ్స్‌తో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందచేస్తున్న కార్మిక సంఘాల నాయకులు
హైదరాబాద్, మే 20, అద్దం న్యూస్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పలు కార్మిక సంఘాలు హైదరాబాద్‌లో మంగళవారం ఆందోళనకు దిగాయి. హైదరాబాద్‌లోని ఆర్టీసి క్రాస్ రోడ్ చిక్కడపల్లి కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బహుజన వామపక్ష కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యంలో తెలంగాణ పీపుల్స్ జేఏసీ, నేషనల్ అలియన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్ సంయుక్త ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో తెలంగాణ పీపుల్స్ జేఏసీ కో – కన్వీనర్ రవిచందర్, టిబిఎన్‌సికెయు నాయకుడు కల్లెపు చంద్రశేఖర్ ప్రసాద్, ఐఎఫ్‌టియు జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ షావలి, టిబిఎన్‌సికెయు జిల్లా నాయకుడు ఆంజనేయులు, పీవోడబ్ల్యు స్త్రీ విముక్తి నాయకురాలు పి.సునీత, తెలంగాణ ఉద్యమకారుల జెఎసి సెక్రటరి జనరల్ తుమ్మల ప్రఫూల్‌రాంరెడ్డి, కెహెచ్‌పిఎస్ నాయకుడు ప్రభాకర్, ఏఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్, ఎస్ఈవిఎ నాయకురాలు రేణుక, బిఎల్‌టియు నాయకుడు సునీల్, పియుకెవి అధ్యక్షుడు యాదగిరి, టిపిఎఫ్ నాయకుడు రాంబాబు, అనిల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల సంఘాలు ఈరోజు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. అసంఘటిత కార్మికులకు కనీస వేతనం చట్టం అమలు కావడం లేదన్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో కనీస వేతన చట్టం అమలు కావడం లేదని, వెంటనే అమలు చేయాలన్నారు. అలాగే భీమా, ఈఎస్ఐ సౌకర్యంతో పాటు ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించి, సౌకర్యాలు కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడ నాడాలని, లేని పక్షంలో యావత్ కార్మిక లోకం ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం సంయుక్త కార్మిక కమిషనర్ ఆర్.చంద్రశేఖరంకు డిమాండ్స్‌తో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందచేశారు.











Leave a Reply