ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అన్యాయ‌మే – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అన్యాయ‌మే

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతున్న టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా


హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 22, అద్దం న్యూస్ :   ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగే అవకాశం ఉందని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పిన్న‌మ‌నేని సాయిబాబా అన్నారు. దాంతో పాటు అన్నదాతలు సాగునీటి కొరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఏర్పడుతుందని, చెన్నై తాగునీటి పథకానికి కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు. సోమ‌వారం దోమ‌ల‌గూడ‌లోని హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేకరుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… నీటి వాటాలలో జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రభుత్వం పోరాడుతుంటే మరో వైపు ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంతో దక్షిణ తెలంగాణలో సాగునీటితో పాటు తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. కర్ణాటకలోని ధార్వాడ, బాగల్ కోట్ జిల్లాల సరిహద్దుల్లో నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్టుతో తెలంగాణకు కృష్ణా జలాల ప్రవాహం ఇప్పటికే తగ్గిందని తెలిపారు. అయితే ప్రాజెక్టు ఎత్తును మరింత పెంచాలని కర్ణాటక ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేయడంతో పాలమూరు బతుకులు ఎడారిగా మారతాయన్నారు.

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519 మీటర్ల నుండి 524 మీటర్ల ఎత్తు పెంచడం అనేది దురదృష్టకరమైనదని పేర్కొన్నారు. గతంలో కూడా ఈ ప్రతిపాదన తెచ్చి నప్పుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా వ్యతిరేకతను తెలియజేసి విశ్వ ప్రయత్నాలు చేసి దాన్ని విరమించుకునేలా చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసిన ఆందోళన వల్ల ఆల్మట్టి ఎత్తు పెంచడం అనేది విరమించుకోవడం జరిగిందని తెలిపారు. తాజాగా ప్రాజెక్టు ఎత్తును పెంచేందుకు డీపీఆర్ సిద్ధం చేయడంతో పాటుగా టెండర్లు కూడా ఖరారు చేయడంతో తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తు న్నదని, ఆల్మట్టి ఎత్తును పెంచితే తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని సాగుభూములకు నీటి ఎద్దడి ఏర్పడటం ఖాయమని అన్నారు. ప్రధానంగా యాసంగి పంటలకు నీరు అంద‌ద‌న్నారు.

ఇటీవల కర్ణాటకలో తెలంగాణలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండడం వల్ల ఇరువురు కుమ్మకై ఎత్తు పెంచుకునే ఆలోచనలో కర్ణాటక ప్రభుత్వం ఉందని విమ‌ర్శించారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాని, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని స్పందించకపోవడం దురదృష్టకరం అని ధ్వ‌జ‌మెత్తారు. కేవలం ఢిల్లీకి కప్పం కట్టడమే మా ప్రధమ కర్తవ్యంలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు ఇదే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీసుకువచ్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనాడు ఆల్మట్టి విషయంలో మాట్లాడి తెలంగాణ, ఆంధ్ర రైతులకు అన్యాయం చేయవద్దని అన్నారని… అదే చనువుతో ఈరోజు ప్రతిపాదనను విరమించుకోనేలా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page