రాజకీయ పార్టీల లబ్ది కోసమే డివిజన్ల పునర్విభజన
– టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా
– జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్‌వి.కర్ణన్‌కు వినతి పత్రాన్ని సమర్పించిన టిడిపి నేతలు
హైదరాబాద్, డిసెంబర్ 17, అద్దం న్యూస్ : రాజకీయ పార్టీల లబ్ది కోసమే డివిజన్ల పునర్విభజన చేశారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా లు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జిహెచ్ఎంసి ) పరిధిలోని డివిజన్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 150 నుండి 300 కు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న ప్రతిపాదనలపై మా అభ్యంతరాలను తెలియజేస్తూ బుధవారం జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ ను కలిసి వివరణాత్మక వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా లు మాట్లాడుతూ… ప్రతిపక్ష పార్టీలను, స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా, కేవలం వారం రోజుల వ్యవధిలో అభిప్రాయాలు చెప్పాలనడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. కనీసం నెల రోజుల సమయం ఇచ్చి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, పునర్విభజనలో లోపాలను శాసనసభ నియోజకవర్గాల పరిధిని పరిగణనలోకి తీసుకోకుండా, వార్డులను ఇష్టానుసారంగా విభజించడం వల్ల పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. కొన్ని డివిజన్లు రెండు నియోజకవర్గాల పరిధిలోకి రావడం శాస్త్రీయతకు విరుద్ధమని విమర్శించారు. ఈ పునర్విభజన ప్రక్రియ కేవలం కొన్ని రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూర్చేలా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రజల సౌకర్యం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
శివారు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసిలో విలీనం చేసే ముందు అక్కడ మౌలిక వసతుల కల్పనపై స్పష్టత ఇవ్వాలని, ప్రజల అభిప్రాయం తీసుకోకుండా నిర్బంధంగా విలీనం చేయడం సరైంది కాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వార్డుల పునర్విభజన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, నియోజకవర్గాల వారీగా నోడల్ ఆఫీసర్లను నియమించి, వార్డు బ్లాకులు, ఇంటి నంబర్ల ఆధారంగా పారదర్శకంగా విభజన చేపట్టాలని కమిషనర్ ను కోరారు. అదే విధంగా డిలిమిటేషన్‌కు సంబందించిన మ్యాపులను కూడా ప్రకటించాలని కోరారు. ఇందుకు కమీషనర్ ఆర్‌వి.కర్ణన్ సానుకూలంగా స్పందించి మ్యాపులను త్వరలో రిలీజ్ చేస్తామని, ఇతర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ నాగు నగేష్, నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్, ఓ.వెంకటేష్ చౌదరి, బివై.శ్రీకాంత్, జోగింధర్ సింగ్, ఎబిఆర్ మోహన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply