...

42 శాతం బిసి రిజ‌ర్వేష‌న్ల అమ‌లు కోసం ప్రధానమంత్రితో అఖిలపక్షం చర్చలు జరపాలి – బిసిల న్యాయ సాధన దీక్ష‌లో వ‌క్త‌ల డిమాండ్

స్థానిక సంస్థల ఎన్నికలకు రాజ్యాంగ సవరణ శాశ్వత పరిష్కారం చేయాలి

ఎన్నికలు చట్టపరంగా జరపాలి

ప్రధానమంత్రితో అఖిలపక్షం చర్చలు జరపాలి

» న్యాయ సాధన దీక్ష‌లో వ‌క్త‌ల డిమాండ్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 16, అద్దం న్యూస్ :     స్థానిక సంస్థల ఎన్నికలను చట్టబద్ధంగా జరపాలని అఖిలపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం హైద‌రాబాద్‌ ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్ వద్ద తెలంగాణ బీసీ జాక్ చైర్మన్ ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో బిసిల న్యాయ సాధన దీక్ష చేప‌ట్టారు.ఈ దీక్ష కార్యక్రమానికి బి.సి కమిషన్ మాజీ చైర్మన్ వక్లాభరణం కృష్ణమోహన్ అధ్యక్షత వహించారు. ఈ పోరాట దీక్షకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు మద్దతు ప్రకటించారు. బీసీలలో చైతన్యం వచ్చిందని, పోరాట పటిమ పెరిగిందని, ఇప్పుడు సాధించకపోతే ఎప్పుడు సాధించమని నేత‌లు హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బిఆర్ఎస్ ఎమ్మెల్సి ఎల్‌.ర‌మ‌ణ‌, జాతీయ బిసి సంక్షేమ సంఘం కో–ఆర్డినేటర్ డాక్ట‌ర్‌.ర్యాగ రిషి అరుణ్ కుమార్, 45 బిసి కుల సంఘాలు, 39 బిసి సంఘాలు, కేంద్ర ప్రభుత్వ ఓబిసి ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర బిసి ఉద్యోగ సంఘా నాయకులు దీక్షలో పాల్గొన్నారు.

                            ఈ సంద‌ర్భంగా తెలంగాణ బీసీ జాక్ చైర్మన్ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… న్యాయపరంగా కేసు గెలుస్తుంద‌ని, రిజర్వేషన్లను పార్టీ పరంగా ఒప్పుకోమ‌న్నారు. రిజర్వేషన్ల కేసు హై కోర్టులో నడుస్తుందని, కేసు గెలుస్తుందని అన్నారు. ఎన్నికలు పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి జరపాలని రేపు జరిగే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునున్నట్లు తెలుస్తుందని తెలిపారు. ఇది చాల అన్యాయమ‌ని, గతంలో అనేక సార్లు ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ అధ్యక్షులు చట్టబద్దంగా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు మాట మార్చితే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని కృష్ణ‌య్య‌ హెచ్చరించారు. ఒక నెల రోజులు ఆగితే తీర్పు వస్తుందని, కేసు గెలవడానికి బలమైన ఆధారాలు ఉన్నాయ‌ని, అలాంటప్పుడు ఎన్నికలకు తొందరెందుకు ? బిసిలకు అన్యాయం చేస్తారా అని ధ్వ‌జ‌మెత్తారు. ఈ కేసు రాజ్యాంగపరంగా బలంగా ఉంద‌ని, రాజ్యాంగంలోని 243-D-6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం ఉందని… దీని ప్రకారం జీవో జారీ చేశారన్నారు. చ‌ట్ట ప్రకారమే జీవో విడుదల చేశారని, ప్రజల చేత ఎన్నుకోబడి శాసనసభలో బీసీ బిల్లు పాసయిందన్నారు. న్యాయపరంగా కూడా జీవోకు బలం ఉంద‌ని.. చట్ట బద్దత ఉంద‌న్నారు. మండల్ కమిషన్ కేసు సందర్భంగా 9 మంది జడ్జీల ధర్మాసనం తీర్పు ప్రకారం జనాభా లెక్కలు ఉంటే దానిని అనుగుణంగా రిజర్వేషన్లు పెంచవచ్చని తీర్పు చెప్పిందని తెలిపారు. ప్రత్యేకంగా డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసే జనాభా లెక్కలు తీసి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు కృష్ణమూర్తి కేసులో తీర్పు చెప్పిందన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సందర్భంగా 50 శాతం సీలింగ్‌ను సుప్రీంకోర్టు ఎత్తివేసిందన్నారు. అగ్రకులాలకు రిజర్వేషన్లపై ఈ కేసు సందర్భంగా 50 శాతం సీలింగ్ ఎత్తివేసారని, బీసీ కేసు సందర్భంగా ఎత్తివేయడానికి అభ్యంతరం ఏమిటి ? అని ప్ర‌శ్నించారు. రాజకీయ రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్‌కు అర్ధం హేతుబద్ధత లేదన్నారు. ఎందుకంటే విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లకు “మెరిట్” దెబ్బ తింటుందని చేసే వాదనకు కొంత వరకు హేతు బద్ధత న్యాయం ఉంద‌న్నారు. మండల్ కమిషన్ కేసులో కూడా రాజకీయ, విద్య, ఉద్యోగాలకు “మెరిట్ష ఉంటుంద‌ని 50 శాతం సీలింగ్ ప్రస్థావ‌న‌ ఉంద‌న్నారు. తెలంగాణ “బంద్” కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని, అదే విధంగా రాజ్యాంగ సవరణకు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. రిజర్వేషన్ల సమస్యకు ప్రతిసారి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వస్తున్నాయని, దీనికి రాజ్యాంగ బద్దత కల్పించడమే శాశ్వత పరిష్కారమన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు విషయంలో మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో కూడా బీసీలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి… కానీ ఆ రాష్ట్రాలలో బీసీలు తిరగబడలేదన్నారు. కానీ మన రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల రక్షణ కోసం రాష్ట్ర బంద్ జరపడం గర్వించదగిందని అన్నారు. స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లాలలో, నియోజకవర్గ కేంద్రాలలో బీసీ సంఘాలు, కుల సంఘాలు ప్రజా సంఘాలతో సమావేశం జరిపి కార్యాచరణ రూపొందించాలని అన్నారు. అన్ని పట్టణాల, జిల్లాలల, మండలాల కేంద్రాల్లో నిరాహార దీక్షలు, ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

                  బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. 42 శాతం బిసిల రిజ‌ర్వేష‌న్ల సమస్య ప్రధానమంత్రితో మాట్లాడి చర్చలు జరుపుతామన్నారు. ఎమ్మ‌ల్సి ఎల్.రమణ మాట్లాడుతూ… రిజర్వేషన్ల కేసులో 30 బీసీ సంఘాలు కేసులు వేశారని, పిటిషనర్ల వాదన కూడా వినకుండా ఎన్నికలకు ఎలా వెళుతారని ప్రశ్నించారు. జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లకు కల్పించే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడానికి రాజ్యాంగ సవరణ జరగాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ దీక్ష‌లో కురమ సంఘం అధ్యక్షుడు గొరెగె మల్లేష్ యాదవ్, గౌడ్ సంఘం మహిళా సంఘం అధ్యక్షరాలు అనురాధ గౌడ్, బిసి సంక్షేమ సంఘం నాయకులూ లాల్ కృష్ణ ప్రసాద్, వెంకటేష్, జిల్లపల్లి అంజి, అనంతయ్య, పగిళ్ళ సతీష్, బిసి యువ‌జ‌న సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ మార్క ర‌మేష్ యాద‌వ్‌, మోడీ రాందేవ్, రాజు నేత, ప్రీతం, శివ యాదవ్, పృథ్వి గౌడ్, రాంగోపాల్ యాదవ్, వేణుమాధవ్, కిషోర్ యాదవ్, భాను ప్రసాద్, జిల్లా బిసి సంఘా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.