స్టీల్ బ్రిడ్జి దిగుతుండగా రోడ్డు ప్రమాదం
ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
హైదరాబాద్, జులై 28, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరం స్టీల్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందిరాపార్క్ లోయర్ ట్యాంక్ బండ్ రామకృష్ణ మఠం వద్ద ఉన్న నాయిని నరసింహ రెడ్డి స్టీల్ బ్రిడ్జ్ రెయిలింగ్ కు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ద్విచక్ర వాహనంతో ప్రమాదవశాత్తు డీకొట్టి వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దోమలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్లో నివసించే బి.అశోక్ (40) నెక్లెస్ రోడ్డు వద్ద విజయ డైరీ పార్లర్ నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం తన భార్య లావణ్య, చెల్లెలు కవిత, ఆరేళ్ళ కుమార్తె ఆకాంక్షతో కలిసి ( ఏపి 09 సికె 3289 ) నంబర్ గల తన బైక్ పైన రాంనగర్ నుంచి నాయిని నరసింహ రెడ్డి స్టీల్ బ్రిడ్జ్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు వెళుతున్నాడు. రామకృష్ణమఠం వద్ద బ్రిడ్జి చివర కిందకు దిగే సమయంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం బ్రిడ్జికి ఉన్న శిలాఫలకం గోడను డీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్రంగా దెబ్బలు తగిలి రక్తస్రావం కావడంతో అశోక్ అక్క డికక్కడే మరణించాడు. బైక్ మీద ఉన్న ఆరేళ్ల చిన్నారితో పాటు లావణ్య, కవిత లకు గాయాలు అయ్యాయి.లావణ్య, కవిత లను ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, తలకు, కాళ్లకు తీవ్ర గాయమైన అశోక్ కూతురు ఆకాంక్షను ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అశోక్ భార్య లావణ్య, కూతురు ఆకాంక్ష, చెల్లె కవిత లకు ప్రస్తుతం వైద్యం కొనసాగుతుంది. దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

