ఫీజుల రియంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి
ఈ నెల 14 న సత్యాగ్రహ దీక్షా, 16 న కలెక్టరేట్ల ముట్టడి
– రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, జూలై 11, ( అద్దం న్యూస్ ) : ఫీజుల రియంబర్స్‌మెంట్ ఉద్యమాలకు ముఖ్యమంత్రి స్పందించి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, 150 బీసీ గురుకుల పాఠశాలలు, 120 బిసి కాలేజీ హాస్టళ్ళలకు సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో సత్యాగ్రహ దీక్షా, 16 న కలెక్టరేట్ల ముట్టడిని చేపట్టనున్నట్లు రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, జీవో నెంబర్ 9 ను రద్దు చేయాలని 18 సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్ విద్యానగర్‌లోని బిసి భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్.ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… ప్రస్తుతం బి.సి గురుకుల పాటశాల అడ్మిషన్లకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు రాగా వేల మందికి మాత్రమే సీట్లు ఇచ్చారన్నారు. ఇంకా లక్షల సంఖ్యలో విద్యార్థులు సీట్లు లభించక ఇబ్బంది పడుతున్నారని, జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. బీసీ గురుకుల పాఠశాల అడ్మిషన్ల గురించి రోజు వందలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అడ్మిషన్లు కావాలని తెలుగు సంక్షేమ భవన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. తమ పిల్లల భవిష్యత్తు బాగుపడాలని ఆవేదన చెందుతున్నారని… ఇటీవల SSC ఫలితాల్లో బిసి గురుకులాల్లో 99 శాతం ఫలితాలు రావడంతో ఎక్కువ డిమాండ్ పెరిగిందన్నారు.
రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త స్కీం కూడా బీసీలకు పెట్టలేదని… పైగా కొనసాగుతున్న స్క్రీములను రద్దుచేసి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు 16మంది ముఖ్యమంత్రుల హయాంలో 50 సంవత్సరాలుగా పోరాటాలు చేశానని.. ప్రతి ముఖ్యమంత్రి పోరాటాలకు స్పందించి కొత్త స్కీములు పెట్టారని తెలిపారు. జలగం వెంగళరావు పుల్ మెస్ చార్జీల స్కీము, స్కాలర్ స్కీము పెట్టారని, చెన్నారెడ్డి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో 25 శాతం రిజర్వేషన్లు పెట్టారని, వందలాది హాస్టళ్ళు పెట్టారన్నారు. టి.అంజయ్య స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ సంఖ్య పెద్ద ఎత్తున పెంచారన్నారు. విజయభాస్కర్ రెడ్డి గురుకుల పాఠశాల విధానం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెట్టారని, ఎన్టీ రామారావు స్థానిక సంస్థలలో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు పెట్టారని కృష్ణయ్య గుర్తు చేశారు. రెండోసారి చెన్నారెడ్డి సీఎం అయ్యాక ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల సంఖ్యా వేల సంఖ్యలో గురుకులాలు పెంచారన్నారు. విజయభాస్కర్ రెడ్డి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 34 శాతంకి పెంచి, వందలాది హాస్టళ్ళు మంజూరు చేశారన్నారు.
చంద్రబాబు నాయుడు ప్రైవేట్ కాలేజీ వృత్తివిద్య కాలేజీలు నెలకొల్పి ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ విద్య అందుబాటులోకి తెచ్చారని, రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్‌మెంట్, కాలేజీ హాస్టల్స్, సాచురేషన్ పద్ధతిలో పెద్దఎత్తున్న పెట్టి చరిత్ర సృష్టించారని కొనియాడారు. రోశయ్య బిసి, ఎస్సీ, ఎస్టీ కాలేజి హాస్టల్స్ ప్రారంభించారని తెలిపారు. ఇంకా కెసిఆర్ కాలంలో ఏకంగా బిసిలకు 290, మైనారిటీలకు 206, ఎస్సీలకు 100, ఎస్టీలకు 50 ఇలా ఏకంగా 650 గురుకులాలు మంజూరు చేసి రికార్డు సృష్టించారని తెలిపారు. ఇలా ప్రతి ముఖ్యమంత్రి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నూతన స్కీములు పెట్టి చరిత్ర కెక్కారని కృష్ణయ్య అన్నారు. కానీ రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా స్కీములు రద్దు చేసే పనికి పూనుకున్నారని.. రద్దుల ముఖ్యమంత్రిగా చరిత్ర కెక్కుతారని ధ్వజమెత్తారు. ఫీజుల రియంబర్స్‌మెంట్ పై గత నెల రోజులుగా అన్ని విద్యాసంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయని, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రి దిగి రాకపోవడం దుర్మార్గమన్నారు. దీని పై బిజెపి బాగా స్పందిస్తుందని, బిఆర్ఎస్ ఇతర పార్టీలు దీనిపై ఇంకా స్పందించాలని కోరారు. ఈ సమావేశంలో బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిలపల్లి అంజి, బిసి కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, బిసి సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు సి.రాజేందర్ ముదిరాజ్, గుజ్జ కృష్ణ యాదవ్, ఓయూ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిఖిల్ పటేల్, రాజు నేత తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply