ఆర్టీసీ వినూత్న నిర్ణయానికి ప్రయాణీకుల బ్రహ్మరథం
రోజు రోజుకూ పెరుగుతున్న బుకింగ్స్
– ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
హైదరాబాద్ బ్యూరో, జూలై 10, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్–బెంగళూరు మధ్య ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రయాణీకులకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC ) ప్రవేశపెట్టిన వినూత్న ఆఫర్‌కు ప్రయాణీకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–బెంగళూర్ రూట్లల్లో ఆర్టీసీ బస్సు సర్వీసు స్థాపింగుల సంఖ్యను పెంచడంతో పాటు, బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు నగరంలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.
ఆఫర్ వివరాలు & ప్రయాణీకుల స్పందన :
ఉచిత పుష్పక్ ఏసీ ప్రయాణం: బెంగళూరుకు TGSRTC బస్సు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకులు, హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ రూట్లో నడిచే ‘పుష్పక్ ఈ-సిటీ ( Pushpak AC )’ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. మీ బెంగళూరు ప్రయాణ టికెట్ను చూపించి ఈ ఉచిత సౌకర్యాన్ని పొందవచ్చని తెలిపారు.
పెరిగిన బుకింగ్స్ :
ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం వల్ల ప్రయాణీకులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, ప్రయాణం మరింత సులువైందని నాగిరెడ్డి తెలిపారు. దీని ఫలితంగా ప్రతిరోజూ అదనంగా 60 నుండి 70 టికెట్లు బుక్ అవుతుండటం విశేషమన్నారు.
అదనపు సర్వీసులు :
ప్రయాణీకుల రద్దీ, డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ – బెంగళూర్ మధ్య బస్ స్టాపింగులను సంస్థ భారీగా పెంచిందన్నారు. అదే విధంగా రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు నడపాలని ఎండీ నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రయాణీకుల సౌకర్యార్థం, వారి సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా TGSRTC నిరంతరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోందన్నారు. బెంగళూరు ప్రయాణీకుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత పుష్పక్ ఏసీ కనెక్టివిటీకి వస్తున్న ఆదరణ చాలా సంతోషాన్నిస్తోందని, ఈ సదుపాయాన్ని ప్రయాణీకులందరూ మరింతగా సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కోరారు.












Leave a Reply