కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ప్రతిపాదనలపై ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
– ట్రాఫిక్ నివారణే ధ్యేయం.. త్వరలోనే అమలుకు చర్యలు
– కాలినడకన ఐదు కిలోమీటర్లు తిరిగి జంక్షన్లను పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్, సీపీ
– పాదచారుల రక్షణకు పెలికాన్ సిగ్నల్స్, లేన్ మార్కింగ్‌లు
హైదరాబాద్ బ్యూరో, జూలై 15, ( అద్దం న్యూస్ ) : కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించి, వాహనాల సాఫీ రాకపోకల కోసం ప్రతిపాదించిన వన్‌వే మార్గ పనులను బుధవారం ఉదయం వివిధ విభాగాల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, జాయింట్ సీపీ ( ట్రాఫిక్ ) డి.జోయల్ డెవిస్ సహా వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు అధికారులు కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు ఐదు కిలోమీటర్ల మేర కాలినడకన రోడ్లు, ప్రధాన జంక్షన్లను నిశితంగా పరిశీలించారు. అగ్రసేన్ కూడలి, ఫిలింనగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రధాన ద్వారం తదితర ప్రాంతాలను సందర్శించి, అక్కడి ట్రాఫిక్ సరళిని అడిగి తెలుసుకున్నారు. హెచ్–సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ఇటీవల ఈ మార్గంలో చేపట్టిన వన్‌వే ట్రయల్ రన్ సమయంలో తలెత్తిన సమస్యలపై చర్చించారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులు ఇరుకుగా ఉండటం వల్లే రద్దీ వేళల్లో ట్రాఫిక్ స్తంభిస్తోందని గుర్తించిన అధికారులు.. ఆయా చోట్ల తక్షణమే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ సిబ్బందిని ఆదేశించారు.
ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే మార్గాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు వివిధ విభాగాలు చేపట్టాల్సిన పనుల పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన చిన్నపాటి సివిల్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్నారు. ముఖ్యంగా రోడ్డు దాటే పాదచారుల రక్షణ కోసం లేన్ మార్కింగ్‌లు, పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వీటితో పాటు ప్రస్తుతం సాగుతున్న పార్కు అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో రద్దీని నివారించేందుకు ప్రతిపాదించిన వన్‌వే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ సిటీ పోలీస్ సూచించిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. పనులు జరిగే సమయంలో ప్రజలు సహకరించాలని కోరారు. నగరవాసులకు ప్రయాణ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు పోలీస్, జీహెచ్‌ఎంసీ విభాగాలు నిరంతరం సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని వివరించారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ సంతోష్, డీసీపీ ( ట్రాఫిక్ ) కాజల్‌తో పాటు జీహెచ్‌ఎంసీ, పోలీస్ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.![]()

