హైదరాబాద్, జూన్ 24, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ వీధిలో కలుషిత నీటి సరఫరా అవుతుంటే పట్టించుకోరా అని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా అన్నారు. “నానాటికి తీసికట్టు నానం బొట్టు” అన్న చందంగా హైదరాబాదు నగర పరిస్థితి ఘోరంగా తయారైందని.. నగరంలో ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగిపొర్లుతున్న పట్టించుకునే నాధుడే లేడని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చిక్కడపల్లిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయ వీధిలో కలుషిత నీటి సరఫరా జరుగుతుందన్న ప్రజల ఫిర్యాదు మేరకు గత 15 రోజుల క్రితం వాటర్ లైన్ కొరకు తవ్వి విడిచిపెట్టి… ఇప్పటి వరకు దాన్ని పూడ్చలేదన్నారు. ఆ గుంతలో పడి ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యులని ఆయన ప్రశ్నించారు. అసలే అధిక జనాభా రద్దీ కల్గిన ప్రాంతంలో ఈ విధంగా గుంతలు తవ్వి విడిచిపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కనీసం రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ కూడా ప్రశ్నించడం లేదని విమర్శించారు. జిహెచ్ఎంసి కమిషనర్ 80 శాతం వరకు టాక్స్ వసూలు చేశామని ప్రచార ఆర్భాటం చేస్తున్నారు… కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజా ఆరోగ్య విషయంలో కానీ… జిహెచ్ఎంసి ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నోటీసుల మీద నోటీసులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పన్నులు వసూలు చేస్తారు… అసలు జిఎస్ఎంసి ఉన్నది దేనికోసం కేవలం జీతాలు తీసుకుని విలాసవంతాలకా లేదా ప్రజలకు సర్వీసు అందించడం కోసమా అని అన్నారు. అస్తవ్యస్తమైన రోడ్లు వాటిపై డ్రైనేజీ పొంగిపొర్లుతూ హైదరాబాద్ నగరం మురికి కోపంగా మారిందన్నారు. జిహెచ్ఎంసి పూర్తిగా విఫలమైందని, ఒక చేతగాని సంస్థగా మిగిలిపోయిందన్నారు. ఈ పద్ధతి మార్చుకోకపోతే ఇటీవల గొర్రెల కాపరులు గాంధీభవన్ ను ముట్టడించినట్లు జిహెచ్ఎంసి ప్రజలందరూ కలిసి ముట్టడించే రోజు త్వరలో వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకాక, అధికారంలోకి వచ్చిన సంవత్సరన్నర కాలంలో 5 గురి కమిషనర్లను అధికారులను మార్చిందన్నారు.
జిహెచ్ఎంసిలో ప్రతిపక్ష కార్పొరేటర్లు ఎంతో మంది ఉన్నా ఏ ఒక్కరూ ప్రశ్నించడం లేదని వాపోయారు. అధికారులు అడ్మినిస్ట్రేషన్ ను అర్థం చేసుకొని కుదురుకునే లోపే వారిని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారన్నారు. గతంలో రోనాల్డ్ రోస్ 11 నెలలు.. ఆమ్రపాలి నాలుగు నెలలు, ఇలంబర్తి 7 నెలలు జిహెచ్ఎంసి కమిషనర్లుగా పని చేశారన్నారు. వర్షాకాలం మొదలయి రెండు నెలలు గడుస్తున్నా… ప్రజలు వర్షాల వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తోందని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి, అధికారులు స్పందించి, ప్రతిష్టాత్మకంగా తీసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, నాయకుడు ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply