హైదరాబాద్, సెప్టెంబర్ 22, ( అద్దం న్యూస్ ) : యూపీఐ సేవలపై చార్జీలను కేంద్ర బిజెపి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి డిమాండ్ చేశారు. అక్టోబర్ 15 నుండి రూ.2000 లు దాటిన లావాదేవీలు యుపిఐ సేవలపై చార్జీలు వసూలు చేయాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ గోల్కొండ చౌరస్తా నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు టీ.జ్యోతి మాట్లాడుతూ… యూపీఐ సేవలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్‌తో రూ 2000 దాటిన లావాదేవీల పై కేంద్ర బిజెపి ప్రభుత్వం పన్ను విధించి 2026 అక్టోబర్ 15 నుండి అమలు చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఎండిఆర్ వలన సామాన్యులపై భారం పడదని ప్రతిపాదించిన చార్జీలు వ్యాపారస్తులు కట్టుకుంటారని చెప్పడం ప్రజలను మోసగించడం తప్ప ఇంకేమిటని ప్రశ్నించారు. 2016లో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు డిజిటల్ ఇండియా పేరుతో ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహించి ఈరోజు ప్రజల జీవితాల్లో భాగమైపోయిన యూపీఐ సేవలపై కేంద్ర ప్రభుత్వం చార్జీలు వసూలు చేయడం ఎవరి కోసమని ప్రశ్నించారు.
సిపిఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ… యూపీఐ లావాదేవీలలో రూ.2000 దాటిన ట్రాన్సాక్షన్ వాటా 65 శాతం ఉందన్నారు. 2000 దాటిన ప్రతి ట్రాన్సాక్షన్ పై పన్ను చెల్లించాల్సిన అవసరం వచ్చిందని అన్నారు రూ 75వేలు దాటిన లావాదేవీలకు 300 రూపాయలు, 50 వేలు దాటిన లావాదేవీలకు 200 చార్జీలు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. నోట్ల ముద్రణకు ప్రతి సంవత్సరం 4875 కోట్లు ఖర్చు అవుతున్నది. ఆన్లైన్ సేవలకి ప్రతి సంవత్సరం 2183 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తున్నది. ఆన్లైన్ లావాదేవీలలో అమెరికాకు చెందిన గూగుల్ పే, ఫోన్ పే కంపెనీల వాటా 83 శాతం ఉందని అమెరికాకు లాభం చేకూర్చడం కోసం ఈ ఎండిఆర్ చార్జీలను కేంద్ర ప్రభుత్వం విధించిందని విమర్శించారు. యూపీఐ సేవలపై చార్జీలు వసూలు చేయాలనే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకి సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మహేందర్ అధ్యక్షత వహించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.అరుణ జ్యోతి, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు కె.నాగలక్ష్మి, నగర కమిటీ సభ్యులు ఆర్.వెంకటేష్, జె.కుమారస్వామి, పద్మ, జి.నరేష్, జి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
