వరంగల్, ( అద్దం న్యూస్ ) : కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది.. ఇంకా 500 రోజులే మిగిలి ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కెటిఆర్ స్పష్టం చేశారు. వరంగల్‌లోని కేడీసీ గ్రౌండ్లో ఆదివారం జరిగిన జన చైతన్య సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఏకశిలా విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతి రెడ్డి, ఆయన అనుచరులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలను కెటిఆర్ కప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… పారిశ్రామికవేత్తల తలపై తుపాకీ పెట్టి రేవంత్ సోదరులు వందల కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ కూతురే స్వయంగా చెప్పిందన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి ఎన్నో తలలతో విజృంభిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల వరకు వసూళ్లు జరుగుతున్నాయని చెబుతున్నారని, పనులు జరగాలంటే 20 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని మరో ఎమ్మెల్యే చెబుతున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రజాపాలన కంటే పర్సంటేజీల పాలనే ఎక్కువగా కనిపిస్తోందన్నారు. హామీలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా రేవంత్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి కుటుంబాల ప్రైవేట్ విద్యా వ్యాపారాల కోసమే ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు కుట్ర జరుగుతోందని అన్నారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో వరంగల్‌లో సంక్షేమం సున్నా.. అభివృద్ధి గుండుసున్నా.. ఒక్క కొత్త ఐటీ కంపెనీని, ఒక్క కొత్త టెక్స్టైల్ పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారు.. ఉన్న పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయన్నారు. 90 శాతం పూర్తయిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మిగిలిన 10 శాతం పనులను మూడేళ్లలో పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.
పేదల ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి చేయకుండా రేవంత్ తన సొంత మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఫ్యూచర్ సిటీపై కాదు.. ఫ్యూచర్ ఉన్న సిటీ వరంగల్‌పై దృష్టి పెట్టండని సూచించారు. ఫార్మా సిటీ పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అని ప్రచారం చేసుకోవడం అభివృద్ధి కాదన్నారు. వరంగల్‌ను భవిష్యత్తులో ప్రధాన ఐటీ, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని కెటిఆర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, టి.రాజయ్య, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, బాల్క సుమన్, రెడ్యానాయక్, గండ్ర వెంకటరమణ రెడ్డి, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి, సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి, పెద్ది స్వప్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








