Saturday, September 19, 2026
No menu items!
HomeAPతెలంగాణపై చలిపులి పంజా.. వచ్చే మూడ్రోజులు జాగ్రత్త

తెలంగాణపై చలిపులి పంజా.. వచ్చే మూడ్రోజులు జాగ్రత్త

📰 Generate e-Paper Clip

తెలంగాణపై చలిపులి పంజా.. వచ్చే మూడ్రోజులు జాగ్రత్త

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మూడు నాలుగు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం కేవలం ఉత్తర తెలంగాణకే పరిమితం కాకుండా.. మధ్య తెలంగాణ మీదుగా హైదరాబాద్ శివారు జిల్లాలైన రంగారెడ్డి, సంగారెడ్డి వరకు విస్తరించింది. గాలిలో తేమ శాతం తగ్గి, పొడి గాలులు ప్రవేశించడం వల్లే చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వివరిస్తు్నారు. ఈ ఏడాది ‘కోల్డ్ వేవ్’ రోజుల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

హైదరాబాద్ మహానగరంతో పాటు దాని శివారు ప్రాంతాల్లోనూ చలి ప్రతాపం ఎక్కువగా కనిపిస్తోంది. తెల్లవారుజామున రోడ్లపై పొగమంచు దట్టంగా అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈశాన్య గాలుల దిశలో మార్పుల వల్ల ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ రాత్రి సమయాల్లో చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు, వృద్ధులు, చిన్నపిల్లలు చలి నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

రాబోయే సంక్రాంతి పండుగ సమయానికి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఉష్ణోగ్రతలు పెరిగే క్రమంలో మళ్లీ తేమ గాలులు ప్రవేశిస్తే.. ఉదయం పూట దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఈ జనవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం కేవలం పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకే పరిమితం కానుందన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page