ప్రైవేట్‌, కార్పొరేట్ స్కూల్‌ల‌లో బుక్స్, యూనిఫామ్స్ దందాని అరికట్టాలి – ఎస్ఎఫ్ఐ

ప్రైవేట్‌, కార్పొరేట్ స్కూల్‌ల‌లో బుక్స్, యూనిఫామ్స్ దందాని అరికట్టాలి
– ఎస్ఎఫ్ఐ

హైద‌రాబాద్‌, మే 29, ( అద్దం న్యూస్ ) :   ప్రైవేట్‌, కార్పొరేట్ స్కూల్‌ల‌లో బుక్స్, యూనిఫామ్స్ దందాని అరికట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) నాయ‌కులు కోరారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) హైదరాబాద్ జిల్లా కమిటీ నాయ‌కుల ఆధ్వర్యంలో శుక్ర‌వారం జిల్లా విద్యాశాఖ అధికారి డీఈవో రోహిణి కి వినతి పత్రం అంద‌చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్‌ నగరంలో ప్రైవేట్‌ కార్పొరేట్ స్కూళ్ల‌ల్లో బుక్స్ యూనిఫామ్స్ పేరుతో ఎల్‌కేజి విద్యార్థులకు 8000 నుండి 15 వేల రూపాయల వరకు తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్నారన్నారు. తమ స్కూల్లోనే బుక్స్ యూనిఫామ్స్ కొనాలని తల్లిదండ్రులను యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. బుక్స్ యూనిఫార్మ్స్ అమ్ముతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని, అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నార‌న్నారు. అనుమతి లేకుండా నడుపుతున్న ప్రైవేట్‌ పాఠశాలలను మూసివేయాలని, తోక పేర్లతో నడిపిస్తున్న పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ప్రీ ప్రైమరీ పేర్లతో ఆకర్షణీయమైన పేర్లతో తల్లిదండ్రులను మోసం చేస్తూ వేలాదిగా ఫీజులు వసూలు చేయడమే లక్ష్యంగా ప్రవేట్ పాఠశాలలు చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు. ప్రవేట్ పాఠశాల యజమాన్యాలకు కనీస భయం లేకుండా విద్యా వ్యాపారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నార‌న్నారు. సీబీఎస్ఈ, కర్క్యులం, ఒలంపియాడ్, వరల్డ్, ఇంటర్నేషనల్ రకరకాల పేర్లతో పాఠశాలలకు తోకలు కలుపుకొని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ పాఠశాలలు వ్యవహరిస్తున్నాయని వాటిపైన జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పుట్టగొడుగుల్లా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా వందలాదిగా ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లెనిన్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమాన్‌, ప్రవీణ్, ఆంజనేయులు, భారత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page