ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి
» మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి
లాలాపేట్, జూన్ 28, ( అద్దం న్యూస్ ) : ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి అని మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ( NHM ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో–2026 కార్యక్రమాన్ని గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి ఆదివారం లాలాపేట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ( UPHC ) లో లాంఛనంగా ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ… తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ప్రతి చిన్నారి ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని అన్నారు. ప్రతి సారి రెండు చుక్కల పోలియో మందు వేయించడం ద్వారా పోలియో మహమ్మారిపై శాశ్వత విజయాన్ని సాధించవచ్చు అని, ప్రతి తల్లిదండ్రి ఈ జాతీయ కార్యక్రమంలో భాగస్వామి కావాలని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ… పల్స్ పోలియో కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు అందించి, భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా కొనసాగించేందుకు చేపట్టిన అత్యంత కీలక ప్రజారోగ్య కార్యక్రమమని తెలిపారు. 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించినప్పటికీ, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికీ పోలియో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు ప్రతి ఏడాది పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. జీవితానికి రక్షణ–ప్రతిసారి రెండు చుక్కలు అనే నినాదాన్ని ప్రతి కుటుంబం ఆచరణలో పెట్టాలని, ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply