మోడల్ రిజర్వాయర్‌గా ఉస్మాన్‌నగర్ జంట రిజర్వాయర్లు – ప్రారంభానికి సిద్ధం చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశం

 

మోడల్ రిజర్వాయర్‌గా ఉస్మాన్‌నగర్ జంట రిజర్వాయర్లు
– స్మార్ట్ వాల్వ్ టెక్నాల‌జీతో వాల్వ్ నిర్వహణ
– సోలార్ పవర్‌తో లైట్లు, డ్రిప్ పద్దతిలో గార్డెనింగ్ నిర్వహణ
– ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్ – 2లో పూర్తయిన రిజర్వాయర్లు
– ప్రారంభానికి సిద్ధం చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
ఆదేశం
 

 

హైదరాబాద్, మే 6, అద్దం న్యూస్ :   ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో విస్తరించిన గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటి సరఫరా చేసేందుకు జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్-2, ప్యాకేజీ 2లో ఉన్న పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఉస్మాన్‌న‌గ‌ర్‌లో నిర్మిస్తున్న 4 ఎంఎల్, 2 ఎంఎల్ సామర్థ్యం కలిగిన జంట రిజర్వాయర్లను ఎండీ అశోక్‌రెడ్డి మంగళవారం సందర్శించారు. ఇటీవలే ఎలక్ట్రికల్ పనులు, క్లోరిన్ రూమ్ పనులు పూర్తి చేయగా.. అంతర్గత రహదారులు, సుందరీకరణ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారుల్ని ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశించారు. రిజ‌ర్వాయ‌ర్ల‌లో పంపు రూమ్, ఇన్ లెట్, అవుట్ లెట్ లు ప‌రిశీలించారు. డిస్ట్రిబ్యూష‌న్ లైన్ల‌ను, కొత్త రిజ‌ర్వాయ‌ర్ల వ‌ల్ల ల‌బ్ది జ‌రిగే ప్రాంతాల వివ‌రాల‌ను, కొత్త కనెక్షన్లు.. డొమెస్టిక్, బల్క్ కనెక్షన్లు తదితర అంశాలపై ఆరా తీశారు. ఉస్మాన్ నగర్ రిజర్వాయర్ల సర్వీస్ ఏరియాకు సంబంధించిన వాటర్ ఆడిట్ ను ప్రారంభించామని.. ప్రయోగాత్మకంగా ఈ రిజర్వాయర్ల నుంచి సరఫరా చేస్తున్న ప్రతి చుక్కనూ లెక్క కట్టేలాగా ఫ్లో మీటర్ ను పెట్టి, చివరి వినియోగదారుని వద్ద కూడా మీటర్ రీడింగ్ సరిపోయేలా లెక్క కడితే ట్రాన్స్ మిషన్ లాస్ తెలుస్తాయని అన్నారు. దాని ద్వారా వృథాగా పోతున్న నీటిని గుర్తించి దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుందని ఎండీ వివరించారు. ఈ జంట రిజర్వాయర్ల పరిధిలో ప్రయోగాత్మకంగా డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ పై స్మార్ట్ వాల్వ్ టెక్నాల‌జీతో లైన్ మెన్లు క్షేత్ర స్థాయిలో తిర‌గాల్సిన అవ‌స‌రం లేకుండానే.. మొబైల్ యాప్ తో వాల్వుల‌ను నిర్వహించే విధంగా స్మార్ట్ వాల్వ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంట‌ర్ నెట్ ఆధారిత కమ్యూనికేష‌న్ తో ఆప‌రేట్ చేయొచ్చ‌న్నారు. దీని వ‌ల్ల వాల్వ్ ఆప‌రేష‌న్ తో పాటు వాట‌ర్ క్వాలిటీ, క్వాంటిటీ, క్లోరిన్ శాతం వివరాల్ని తెలుసుకోవ‌చ్చ‌ని. ఈ స్మార్ట్ వాల్వ్ టెక్నాల‌జీ పూర్తిగా సోలార్ ఎన‌ర్జీని ఉపయోగించుకుని ప‌నిచేస్తుంద‌ని వివరించారు. బ్యాట‌రీ బ్యాకప్ సైతం ఉండ‌టంతో.. నిర్వ‌హ‌ణ‌లో ప‌వ‌ర్ సమస్య‌లు ఉండ‌వ‌న్నారు. ప్ర‌యోగాత్మ‌కంగా చేప‌ట్టిన ఈ విధానం ఇప్ప‌టివ‌ర‌కు స‌న‌త్ న‌గ‌ర్ లో స‌మ‌ర్థంగా పనిచేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అలాగే రిజర్వాయర్ నీటి మట్టం.. క్లోరిన్ శాతము తదితర వివరాలను ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేసిన డాష్ బోర్డుకి అందేలాగా, ఒకవేళ రిజర్వాయర్ నుంచి సరఫరా చేస్తున్న నీటిలో క్లోరిన్ శాతం తగ్గితే వెంటనే సంబంధించిన అధికారులకు అలర్ట్ అందేలాగా ఆన్ లైన్ మానిటరింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను అశోక్‌రెడ్డి ఆదేశించారు. వీటితో పాటు ఈ రిజర్వాయర్ ప్రాగణంలోని అన్ని లైట్లుకు సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసి, ఉత్పత్తి అయిన విద్యుత్ వినియోగించి లైట్లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ల ప్రాంగణాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం గార్డెనింగ్, ల్యాండ్ స్కేప్ పనులు చేపట్టాలని సూచించారు.

ఉస్మాన్‌న‌గ‌ర్‌లో నిర్మిస్తున్న 4 ఎంఎల్, 2 ఎంఎల్ సామర్థ్యం కలిగిన జంట రిజర్వాయర్లను ప‌రిశీలిస్తున్న జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్‌రెడ్డి

ఉస్మాన్‌న‌గ‌ర్‌లో నిర్మిస్తున్న 4 ఎంఎల్, 2 ఎంఎల్ సామర్థ్యం కలిగిన జంట రిజర్వాయర్లను ప‌రిశీలిస్తున్న జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్‌రెడ్డి

మొక్కల పెంపకానికి నీటిని శుద్ధి చేసిన నీటిని కాకుండా భూగర్భ గల జలాలను ఉపయోగించి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో గార్డెనింగ్ నిర్వహణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. నూత‌నంగా నిర్మాణం పూర్తి చేసుకున్న రిజ‌ర్వాయ‌ర్ల‌పై వివ‌రాల‌తో కూడిన సైన్ బోర్డుల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. అలాగే నీరు పొదుపు చేసి.. వృథాను అరిక‌ట్టే విధానాల గురించి రిజ‌ర్వాయ‌ర్ కాంపౌండ్ వాల్ పై నినాదాలు రాయించాల‌న్నారు. రిజార్వాయర్ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆన్‌లైన్ మానిట‌రింగ్ కోసం జ‌ల‌మండలి ప్ర‌ధాన కార్యాల‌యానికి అనుసంధానం చేయాల‌ని ఆయ‌న సూచించారు. వీటికన్నింటికీ సంబంధించిన డిపిఆర్ ను తయారు చేసి సమర్పించమని ఈ సందర్బంగా ఎండీ అధికారులను ఆదేశించారు. అనంత‌రం రిజ‌ర్వాయ‌ర్ల ప్రాంగ‌ణంలో నిర్మిస్తున్న ఆఫీస్ రూమ్ నిర్మాణం పనులు పరిశీలించిన ఎండీ అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా ఎండీ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో తాగునీటిని ఈ రెండు రిజర్వాయర్ల నుంచి సరఫరా చేస్తామని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లు, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయి.. ఇప్పటికే రిజర్వాయర్ల ఇన్ లెట్, అవుట్ లెట్ నిర్మాణం పూర్తి కావడంతో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించామన్నారు. రూ.30 కోట్లతో నిర్మిస్తున్న ఈ రెండు రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తే.. దాదాపు లక్ష మంది జనాభాకు శుద్ధి చేసిన తాగునీరు లభిస్తుందని వివరించారు. ప్రస్తుతం 55 బల్క్ కనెక్షన్లు రానున్నట్లు, అందుకోసం ఇప్పటికే 22 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ లైన్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, జీఎం, డిజిఎంలు, నిర్మాణ సంస్థ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్ – 2 స్వరూపం :

ఓఆర్ ఆర్ ఫేజ్ – 2 ప్రాజెక్టును మొత్తం రూ.1200 కోట్ల వ్యయంతో చేపట్టగా.. కొత్తగా 71 సర్వీసు రిజర్వాయర్లు ( 140.50 మిలియన్ లీటర్ల సామర్థ్యం ), 2758 కిలో మీటర్ల మేర నూతన పైప్‌లైన్ నెట్‌వ‌ర్క్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయి రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తే మొత్తం 3.6 లక్షల కుటుంబాలు, 25 లక్షల జనాభాకు ప్రయోజనం కలుగుతుంది. ఓవరాల్ గా ఇందులో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయతీలు లబ్ది పొందుతాయి. దీన్ని రెండు ప్యాకేజీల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు.

ప్యాకేజీ -1 : మొదటి ప్యాకేజీలో రూ. 613 కోట్లతో 33 సర్వీసు రిజర్వాయర్లు, 1522 కిలోమీటర్ల మేర పైపు లైను నెట్ వర్క్ నిర్మాణం చేపడుతున్నారు. దీని పరిధిలోకి సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్ నగర్, ఇబ్రహీం పట్నం, ఘట్ కేసర్, కీసర ( 7 మండలాలు ) వస్తాయి. మొత్తం 4.36 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది.

ప్యాకేజీ -2 : రెండో ప్యాకేజీలో కొత్తగా 38 సర్వీసు రిజర్వాయర్లు, 1250 కిలో మీటర్ల మేర పైపు లైను నెట్ వర్క్ నిర్మాణం చేపడుతుండగా.. వీటికయ్యే ఖర్చు రూ. 587 కోట్లు. దీని పరిధిలోకి రాజేంద్రనగర్, శామీర్ పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, ఆర్సీపురం, బొల్లారం (5 మండలాలు) వస్తాయి. మొత్తం 1.96 లక్షల మందికి లబ్ది కలగనుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page