...

సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం – హైదరాబాద్‌ సీపీ వీసీ.సజ్జనర్‌

సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం
– హైదరాబాద్‌ సీపీ వీసీ.సజ్జనర్‌
విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లతో ‘ సైబర్ జాగరూకత దివాస్ ‘ అవగాహన సదస్సు
– అధికారులతో కలిసి ‘ సురక్ష కా తిరంగా ’ పోస్టర్ ఆవిష్కరణ

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 5, ( అద్దం న్యూస్ ) :   కష్టార్జితాన్ని సైబర్‌ నేరగాళ్ల చేతిలో పెట్టి మోసపోవద్దని, విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్ వీసీ.సజ్జనర్ హెచ్చరించారు. ‘ సైబర్ జాగరూకత దివాస్ ‘ పురస్కరించుకుని సిటీ సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో బుధవారం విశ్రాంత అధికారులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సజ్జనర్‌.. ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీలు రతన్, మాలకొండయ్య, విశ్రాంత ఈఎన్సీ కరీంలతో కలిసి సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించే ‘ సురక్ష కా తిరంగా ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సదస్సులో సీపీ సజ్జన‌ర్ మాట్లాడుతూ… సాంకేతికత పెరిగేకొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయని తెలిపారు. నగరంలో ఒక ఏడాది కాలంలో దొంగతనాలు, దోపిడీల వంటి సంప్రదాయ నేరాల వల్ల రూ.30 కోట్ల నష్టం వాటిల్లితే.. ఒక్క సైబర్ నేరాల రూపంలోనే బాధితులు ఏకంగా రూ.400 కోట్లకు పైగా కోల్పొతున్నార‌ని తెలిపారు. అంటే సగటున రోజుకు రూ.కోటికి పైగా ప్రజల సొమ్ము కేటుగాళ్ల ఖాతాల్లోకి మళ్లుతోందన్నారు. విశ్రాంత ఉద్యోగుల డిజిటల్, భౌతిక భద్రతకు నగర పోలీసులు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. సీనియర్ సిటిజన్లను డిజిటల్ అరెస్టులు, పింఛను సేవలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ మోసాలకు గురిచేస్తున్నార‌ని వివరించారు. సీబీఐ, ఈడీ, ఆర్‌బీఐ లేదా పోలీసు అధికారులమని చెప్పి డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు. మన చట్టాల్లో గానీ, పోలీసు వ్యవస్థలో గానీ ‘ డిజిటల్ అరెస్ట్ ’ అనే విధానమే లేదని స్పష్టం చేశారు. అపరిచిత వ్యక్తుల నుంచి అలాంటి ఫోన్‌ కాల్స్‌ రాగానే భయపడకుండా వెంటనే కట్ చేయాలని సూచించారు. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌ల ద్వారా వచ్చే ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటనలు, ట్రేడింగ్ లింక్‌లను చూసి మోసపోవద్దన్నారు. షేర్ ట్రేడింగ్ ను సెబీ ఆమోదించిన రిజిస్టర్డ్ బ్రోకర్లు, అధీకృత డీమ్యాట్ ఖాతాల ద్వారానే చేయాల‌ని చెప్పారు.

ఇంట్లోని పిల్లలు ఫోన్‌లు తీసుకుని ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లలో సభ్యత్వం తీసుకోవడం వల్ల కూడా పెద్దల రిటైర్‌మెంట్ సొమ్ము మాయమవుతుందంటూ కొన్ని ఘటనలను గుర్తుచేశారు. ఒకవేళ అజాగ్రత్త వల్ల సైబర్ మోసానికి గురైతే, తక్షణమే స్పందించి గోల్డెన్ అవర్ లో 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా ఎన్‌సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వెంటనే సమాచారం ఇస్తే బాధితుల సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.

అనంతరం మాజీ డీజీపీ ఎమ్.రతన్ మాట్లాడుతూ… సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు తన ఖాతా నుంచి రూ.5,000 కంటే ఎక్కువ మొత్తానికి చెక్కులు వచ్చినా, విత్ డ్రాయల్స్ ఉన్నా తన ముందస్తు అనుమతి లేనిదే క్లియర్ చేయవద్దని బ్యాంకులకు స్వయంగా సూచించినట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్లు తమ ఫోన్‌లను పిల్లల చేతికి ఇచ్చేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలు తెలియక ఏదైనా బటన్ లేదా సందేహాస్పద లింక్‌ను నొక్కడం వల్ల బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము క్షణాల్లో ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు. మాజీ డీజీపీ పూనం మాల కొండయ్య మాట్లాడుతూ… సైబర్ నేరం జరిగిన తర్వాత బాధితులు ఎంత ఆవేదన పడినా, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా పోగొట్టుకున్న డబ్బును తిరిగి సాధించడం చాలా కష్టమని పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయల నష్టంతో పోలిస్తే రికవరీ అయ్యే మొత్తం అత్యంత స్వల్పం కాబట్టి, ముందస్తు జాగ్రత్తలు పాటించడమే సైబర్ నేరాలకు ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు.

అదనపు సీపీ ( క్రైమ్స్ ) ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ… సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతితో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని, అపరిచిత ఫోన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల పౌరులు ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండాలన్నారు. ఒకవేళ సైబర్ మోసం జరిగితే బాధితులు స్వల్ప సమయంలోనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా ఎన్‌సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే త్వరితగతిన స్పందించేందుకు వీలవుతుందని చెప్పారు. మోసం జరిగిన వెంటనే సమాచారం అందిస్తే నేరస్థుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి, బాధితుల సొమ్మును రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సులో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ చైర్మన్ రమణా నాయక్, గౌరవ కార్యదర్శి రమేష్ మర్రి, డీసీపీలు శిల్పవల్లి, ర‌మ‌ణారెడ్డి, రాజేశ్, నగర సైబర్ క్రైమ్ విభాగ ఏసీపీ శివ‌మారుతి, అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో విశ్రాంత అధికారులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.