వివక్షత, అసమానతలు లేని సమాజం కావాలి
– డిబిఎస్‌యు వ్యవస్థాపకులు, ప్రపంచ వివక్షతా నిర్మూలన ఫోరం గ్లోబల్ కన్వీనర్ పాల్ దివాకర్
హైదరాబాద్, జనవరి 9, అద్దం న్యూస్ : వివక్షత, అసమానతలు లేని సమాజం కావాలని డిబిఎస్‌యు వ్యవస్థాపకులు, ప్రపంచ వివక్షతా నిర్మూలన ఫోరం గ్లోబల్ కన్వీనర్ పాల్ దివాకర్ అన్నారు. దళిత బహుజన శ్రామిక యూనియన్ డిబిఎస్‌యు రాష్ట్ర మహాసభ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన పాల్ దివాకర్ మాట్లాడుతూ… దేశంలో అసమానతలు లేని సమాజ నిర్మాణానికి మరింత కృషి జరగాలని, ఇందుకోసం ప్రభుత్వాలు తగిన చర్యలను చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. 2003 సంవత్సరంలో ఆవిర్భవించిన దళిత బహుజన శ్రామిక యూనియన్ ఇరవై మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో దళిత బహుజన ప్రజల సమస్యలపై నిరంతర ఉద్యమ ప్రయాణం చేయడం అభినందించవలసిన విషయమని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సక్రమ అమలుకోసం పనిచేయడం మూలంగా బాధితులకు ఎంతో అండగా డిబిఎస్‌యు ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరత ఏర్పడుతున్నదని, దీని కోసం అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి రావాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు.
రాష్ట్రంలో చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా దళిత సమాజానికి ఇచ్చిన హామీలను నెరవేర్చి దళితుల సంక్షేమం, అభివృద్ధికి అంకిత భావంతో అమలు చేయాలని అన్నారు. మహాసభ ప్రారంభానికి ముందు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన శ్రామిక యూనియన్ వ్యవస్థాపక సభ్యులు థామస్ పల్లి దానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.చిట్టిబాబు, అడ్వైజర్ వి.నందగోపాల్, కేవీపీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, ప్రజ్వల సెక్రటరీ రేఖ ఏభేల్, గడ్డం ఝాన్సీ, మాజీ మంత్రి పుష్పలీల, తదితరులు ప్రసంగించారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.ఆనంద్, జి.నర్సింహ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పది జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం పదిహేను మందితో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.















Leave a Reply