🔹కాంగ్రెస్ ఉంటదో అక్కడ ప్రోగ్రెస్ ఉండదు
🔹 పాలమూరును మళ్లీ వలసల జిల్లాగా మార్చిన రేవంత్
🔹 పాలమూరు నీళ్ల కోసం కేసీఆర్ పోరాటానికి సిద్ధం
🔹 రైతు బంధు పోయి ‘రాబందు’ పాలన
🔹 యూరియా క్యూలైన్లే ఇందుకు నిదర్శనం
🔹 పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే
🔹 కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధం
🔹 కాంగ్రెస్–బీజేపీ చీకటి స్నేహం బయటపడింది
🔹 బంగారంలాంటి తెలంగాణను దోచుకుంటున్న రేవంత్ ప్రభుత్వం
🔹 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మహబూబ్‌నగర్, డిసెంబర్ 28, అద్దం న్యూస్ : కాంగ్రెస్ గద్దెనెక్కిన నాటి నుంచి అన్నదాతలు అడుగడుగునా అరిగోస పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఒక్క యూరియా బస్తా కోసం అధికారుల కాళ్లమీద పడి బ్రతిమాలాడుకునే గోస అన్నదాతలకు వచ్చిందన్నారు. ఎముకలు కొరికే చలిలో రోజుల తరబడి క్యూలైన్లలో రైతన్నలు బారులు తీరే పరిస్థితి నెలకొందని, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే మళ్లీ ఆనాటి రోజులను తిరిగి తెచ్చిందని కెటిఆర్ ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నాగర్ కర్నూల్ జిల్లా సర్పంచులు, ఉప సర్పంచుల ఆత్మీయ సమావేశ సభ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాను మళ్లీ వలసల జిల్లాగా మార్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… “కేసీఆర్ పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశారు… కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిందన్నారు. తట్టెడు మట్టి కూడా తీయకుండా నికృష్టమైన మాటలు మాట్లాడుతున్నారని, కాంగ్రెసోళ్లు పాలమూరును మళ్లీ వలసల జిల్లాగా మార్చారని, ప్రాజెక్టులను పండబెట్టి పాలమూరు జిల్లాను ఎండబెట్టారు” అని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో పాలమూరు ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేశామని కెటిఆర్ గుర్తు చేశారు. పిలిచిన టెండర్లను రద్దు చేసి ప్రాజెక్టును పండబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీ పడుతున్నారని అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలబడేందుకు, తెలంగాణ నీటి వాటాల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని కేటీఆర్ వెల్లడించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని, ఆయన చేయబోయే ఈ పోరాటానికి పాలమూరు బిడ్డలంతా అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.
రేవంత్ రెడ్డికి కమిషన్ల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదని ఘాటుగా విమర్శించారు. ఇవాళ ఎందుకు పెద్దఎత్తున ప్రజలు కేసీఆర్‌ను కోరుకుంటున్నారో ఆలోచించాలన్నారు. రైతు బంధు పాలన పోయి రేవంత్ రాబంధు పాలన వచ్చిందని ఎద్దేవా చేశారు. రైతులు యూరియా బస్తాల కోసం కాళ్లమీద పడి గోస పడుతున్నారని, చలిలో చెప్పులు క్యూలైన్‌లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌కు రైతుల పట్ల ప్రేమ లేదని, కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇచ్చామని గుర్తు చేశారు. రేవంత్ ఎక్కడికి పోయినా ఆవు కథ లెక్క కేసీఆర్ మీద ఏడుపే కనిపిస్తుందని అన్నారు. రేవంత్ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే రేపోమాపో కరుస్తాడేమో అని ఎద్దేవా చేశారు. రేవంత్ నీకు దమ్ముంటే యూరియా బస్తాలు దొరికేలా చేస్తా అని శపథం చేయాలని, రూ. 4,000 పెన్షన్ ఇస్తా అని శపథం చేయాలని సవాల్ విసిరారు.
హామీల అమలు ఏమైందని నిలదీస్తే రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నారు :
తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే చేస్తున్న అడ్డగోలు వ్యాఖ్యలు, బూతులపై కేటీఆర్ మరోసారి ఘాటుగా స్పందించారు. అమలుకాని, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు అందరినీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కంటే అన్నీ ఎక్కువిస్తామని ఆశ పెట్టారని, హామీల అమలు ఏమైందని నిలదీస్తే రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నారని కెటిఆర్ విమర్శించారు. రెండేళ్లు పూర్తైనా ఏమైనా పథకాలని అడిగితే రేవంత్ బూతులు మాట్లాడుతున్నాడని, మహాలక్ష్మి పథకం ఏమైందంటే గుడ్లు పీకి గోటీలాడతానంటున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారని… రెండేళ్లలో రేవంత్ గురించి ప్రజలకు అన్నీ అర్థమయ్యాయని అన్నారు. కేసీఆర్ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశారని, వైకుంఠధామాలు కట్టామని, డంప్ యార్డులు కట్టామని కెటిఆర్ చెప్పారు. దేశంలోనే ఉత్తమ పంచాయతీ అవార్డులు 30 శాతం మనకే వచ్చాయని గుర్తు చేశారు. ప్రతి గ్రామాన్ని దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పడకేసిందని, రేవంత్ పాలనలో ట్రాక్టర్లలో డీజిల్ లేదని, వీధిలైట్లు లేవని విమర్శించారు.
కాంగ్రెస్ ఉంటదో అక్కడ ప్రోగ్రెస్ ఉండదు :
ఎక్కడ కాంగ్రెస్ ఉంటదో అక్కడ ప్రోగ్రెస్ ఉండదని మరోసారి పునరుద్ఘాటించారు. ఇంకా రెండేళ్లే కాంగ్రెస్ ఉందని, ఆ తరువాత బీఆర్‌ఎస్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పల్లెలు మళ్లీ పచ్చబడుతాయని, లక్ష్మీ కళ వస్తుందని అన్నారు. బంగారంలాంటి రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. 10 సంవత్సరాల బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాలు, పరిపాలన వలన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఎకరం రూ. 150 కోట్లకు చేరిందని, ఆ భూములపై రేవంత్ కన్ను పడిందని ఆరోపించారు.
భూముల పై రేవంత్ కన్ను :
హైదరాబాద్‌లో 9,300 ఎకరాలపై రేవంత్ కన్ను పడిందని కెటిఆర్ అన్నారు. ప్రభుత్వాలు పరిశ్రమలకు భూములు ఇస్తాయని, రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో తక్కువ ధరకు భూములు ఇస్తామని చెప్పారని… పరిశ్రమల కోసం ఇచ్చిన భూముల్లో ఏదైనా కట్టుకోవచ్చంటున్నాడు రేవంత్ అని విమర్శించారు. రూపాయికి 30 పైసలు కడితే ఏదైనా కట్టుకోవచ్చా ? అని కెటిఆర్ ప్రశ్నించారు. రూ. 5 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు రేవంత్ హిల్ట్ పాలసీ తెచ్చిండని ఆరోపించారు. లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకుంటుంటే అడ్డుకున్నది మన పార్టీ అని గుర్తు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్–బీజేపీ కలిసిపోయాయి :
రేవంత్ రెడ్డి ఎంత దోపిడీ చేసినా బీజేపీ మాట్లాడదని, బీజేపీ పార్టీ కాంగ్రెస్‌ను విమర్శించదని, కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీని విమర్శించరని తీవ్ర ఆరోపణలు చేశారు. దొంగచీకటిగా కలిసిపోయి దోపిడీ చేసినట్లే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో కలిసిపోయాయని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే రెండు సంవత్సరాల కాలంలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు వైఫల్యాన్ని, మోసాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదని కేటీఆర్ అన్నారు. మరో వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీజేపీని విమర్శించకుండా కేవలం బీఆర్‌ఎస్ పార్టీని మాత్రమే విమర్శిస్తున్నారని అన్నారు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కెసిఆర్‌ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం :
సర్పంచ్ ఎన్నికల్లో వంగబెట్టి గుద్దితే రేవంత్‌కు సోయొచ్చిందని కెటిఆర్ విమర్శించారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుందని, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్ కాగా, అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్ అని తెలిపారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే మన లక్ష్యమని, అభ్యర్థి ఎవరైనా కారు గుర్తు మీద మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
