ఎందరో సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దిన
మారేడ్‌పల్లి జూనియర్ టెక్నికల్ హై స్కూల్ ఇక కనుమరుగు కానుందా !
స్వాతంత్య్ర అనంతరం హైస్కూల్ విద్య పూర్తయిన వెంటనే బలమైన సాంకేతిక శ్రామిక శక్తిని నిర్మించడానికి ముదలియార్ కమిషన్ ( 1952–53 నాటి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ) సెకండరీ విద్యలో వైవిధ్యీకరణను బలంగా సమర్థించింది. దీని ఫలితంగా భారతదేశం అంతటా బహుళార్ధసాధక ఉన్నత పాఠశాలలు, జూనియర్ టెక్నికల్ ఉన్నత పాఠశాలల భావన ఆవిర్భవించింది. ఆచరణాత్మక వృత్తి విద్యను సులభతరం చేయడానికి సాంకేతిక సంస్థలు, జూనియర్ టెక్నికల్ స్కూళ్లు తొలుత కీలక పారిశ్రామిక పట్టణాలకు మరియు అప్పటికే ఉన్న పాలిటెక్నిక్ లకు అనుబంధంగా లేదా వాటి సమీపంలో ఏర్పాటు చేయబడ్డాయి.
పారిశ్రామికీకరణకు ప్రాధాన్యం :
1947లో స్వాతంత్ర్యానంతరం భారతదేశం బలహీనమైన ఆర్ధిక వ్యవస్థ మరియు తీవ్రమైన ఆహార కొరతతో కొట్టుమిట్టాడుతుంది. ఈ పరిస్థితి నుండి దేశాన్ని గట్టెక్కించడానికి సహజంగానే సోషలిస్ట్ భావజాలం గల తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సోవియట్ రష్యా ఆర్ధిక విధానాల పట్ల ఆకర్షితుడవ్వడంతో పాటు ఆనాటి ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తల సిఫార్సుల మేరకు పంచవర్ష ప్రణాలికలను ప్రారంభించారు. 1951 నుండి 1956 వరకు మొదటి పంచవర్ష ప్రణాలికా కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రాధాన్యతను, 1956 నుండి 1961 వరకు రెండవ పంచవర్ష ప్రణాలికా కాలంలో పారిశ్రామిక పురోగతి కోసం పారిశ్రామికీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. మాధ్యమిక విద్య అనేది యువతకు జీవనోపాధి సంపాదించడానికి, జాతీయ ఉత్పాదకతకు సహాయపడటానికి ఆచరణాత్మక, వృత్తిపరమైన నైపుణ్యాలను అందించే ఒక సంపూర్ణ, స్వయం సమృద్ధి గల దశగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంది. అయితే, దేశంలో అప్పటికీ ఇంకా కొనసాగుతున్న బ్రిటిష్ విద్యా విధానం పారిశ్రామిక ప్రగతికి దోహదం చేయదని, అందుకు తగు సంస్కరణలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని భావించి అవసరమైన సిఫార్సులను సూచించేందుకు సెప్టెంబర్ 23, 1952న భారత ప్రభుత్వం అప్పటి మద్రాసు విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డాక్టర్.ఎ.లక్ష్మణస్వామి ముదలియార్ అధ్యక్షతన సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, 1952-53 ను నియమించింది.
ముదలియార్ కమిషన్ ( సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ) :
బహుళ ప్రయోజన ( మల్టీ పర్పస్ ) పాఠశాలలను ప్రవేశపెట్టడం ద్వారా కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా ముందుకు సాగడంతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలను తీర్చిదిద్దడానికి సాంకేతిక, వృత్తివిద్యా విభాగాలను ( అనువర్తిత గణితం, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంశాలు వంటివి ) జోడించాలని ముదలియార్ కమిషన్ ప్రధానంగా ప్రతిపాదించింది. ప్రామాణిక సబ్జెక్టులతో పాటు సాంకేతిక, వ్యవసాయ, వాణిజ్య, ఆచరణాత్మక వృత్తి విద్యా కోర్సులను జోడించాలని సూచించింది. ముదలియార్ నివేదికలోని ఆలోచనలను భారత దేశ రెండవ పంచవర్ష ప్రణాళికలో పొందుపరిచారు. పాక్షిక నైపుణ్యం గల కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి జూనియర్ టెక్నికల్ పాఠశాలల ఏర్పాటుకు ఈ ప్రణాళిక నిధులు సమకూర్చింది. స్థానిక ఆర్థిక అవసరాలను తీర్చడానికి గ్రామీణ సెకండరీ పాఠశాలలు ప్రత్యేక వ్యవసాయ, చేతివృత్తుల కార్యక్రమాలను జోడించాయి. విద్యను మరింత ఉపయోగకరంగా, విద్యార్థి కేంద్రీకృతంగా, నిజ జీవితానికి అనుసంధానంగా మార్చిన ముదలియార్ కమిషన్ భారతదేశంలో మాధ్యమిక స్థాయిలో వృత్తిపరమైన మరియు సాంకేతిక విద్యను ప్రవేశపెట్టే విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ కమిషన్ ప్రతిపాదనలు రెండవ పంచవర్ష ప్రణాళిక ( 1956–1961 ) యొక్క విద్యాపరమైన లక్ష్యాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేశాయి.
జూనియర్ టెక్నికల్ హై స్కూళ్ల ఏర్పాటు :
ముదలియార్ కమిషన్ ( సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, 1952–53 ) సిఫార్సులను అనుసరించి, 1 నవంబర్ 1956 భాషా ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆరు జూనియర్ టెక్నికల్ హై స్కూళ్ల ( జిటిహెచ్ఎస్ ) ను ( 1969–70 విద్యా సంవత్సరంలో వీటిని బాలుర టెక్నికల్ హైస్కూళ్లుగా పునర్నామకరణం చేశారు ) కాకినాడ, విజయవాడ, సికింద్రాబాద్, తిరుపతి, ప్రొద్దుటూరు, మహబూబ్‌నగర్ స్థాపించింది. ఈ ప్రత్యేక వృత్తి విద్యా మాధ్యమిక పాఠశాలలు సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో పనిచేసేవి. విద్యార్థులకు ప్రయోగాత్మక శిక్షణ కోసం అవసరమయ్యే ముడి పదార్థాలను సమకూర్చుకునేందుకు జూనియర్ టెక్నికల్ హై స్కూళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా నిధులు అందేవి. విద్యార్థులకు ప్రాథమిక సాంకేతిక విద్య, ఆచరణాత్మక వృత్తి శిక్షణను అందించడానికి, ఈ సంస్థలను ఈ ప్రాంతాలలో అప్పటికే ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలకు వ్యూహాత్మకంగా అనుసంధానించారు. జూనియర్ టెక్నికల్ హై స్కూళ్ళు పాలిటెక్నిక్ డిప్లొమాలకు ప్రత్యక్ష వారధిగా పనిచేసేవి. దీని పాఠ్యప్రణాళికలో భాగంగా విద్యార్థులు ప్రామాణిక విద్యా విషయాలతో పాటు, సుశిక్షిత ప్రయోగాత్మక వర్క్‌షాప్ శిక్షణను అభ్యసించేవారు. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఫ్లోర్-లెవల్ ఇంజనీరింగ్, టెక్నికల్ అప్రెంటిస్‌లుగా రైల్వేలు, రక్షణ ప్రయోగశాలలు, భారీ ఇంజనీరింగ్ పరిశ్రమలు వంటి ప్రత్యేక ప్రభుత్వ రంగ సంస్థలలో ఉపాధి అవకాశాలు అధికంగా ఉండేవి. కొందరు విద్యార్థులు జూనియర్ టెక్నికల్ హై స్కూళ్ల తరువాత పాలిటెక్నిక్ లో డిప్లొమా, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు ఎన్నో ఉన్నత స్థానాలకు కూడా చేరుకున్నారు. అప్పట్లో జెటిహెచ్ఎస్ ను ఇంజనీరింగ్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా భావించేవారు. ఈ వ్యవస్థలోని కఠినమైన ప్రాక్టికల్ శిక్షణ, డ్రాయింగ్ అంశాలు, సాంప్రదాయ హైస్కూళ్ల కంటే విద్యార్థులకు బలమైన సాంకేతిక నైపుణ్యాన్ని పునాదిని అందించాయని పూర్వ విద్యార్థులు తరచుగా పేర్కొంటారు. ఇది చాలా మంది విద్యార్థులను ఉన్నత ఇంజనీరింగ్ డిప్లొమాలు, సాఫ్ట్‌వేర్, కోర్ మెకానికల్ రంగాలలో వృత్తిలోకి సులభంగా మారడానికి వీలు కల్పించింది. ప్రత్యేకించి 1970 మరియు 1980 దశకాలలో చాలా మంది పూర్వ విద్యార్థులు సికింద్రాబాద్ టెక్నికల్ స్కూల్‌ను ఒక లాంచ్‌ప్యాడ్‌గా ఉపయోగించుకుని, నేరుగా ప్రముఖ రాష్ట్ర పాలిటెక్నిక్‌లలో లేదా ప్రత్యేక మేనేజ్‌మెంట్, టెక్నికల్ సర్టిఫికేషన్‌లలో చేరడం విశేషం. అయితే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఎంఎస్.నం.1003 తేదీ : డిసెంబర్ 11, 1981 ద్వారా సికింద్రాబాద్ లోని జెటిహెచ్ఎస్ “ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రానిక్స్ ” గా మారింది. అప్పటి నుండి ఈ సంస్థ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలెక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, సెమి కండక్టర్ టెక్నాలజీలలో 3 సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా కోర్సులను అందిస్తోంది.
వృత్తి నిపుణుల కొరతకు చెక్ పెట్టేదేలా ?
భారతదేశంలో ఇంజనీరింగ్ కళాశాలల ఇబ్బడిముబ్బడి విస్తరణ, సమాజ దృష్టిని అవసరమైన వాణిజ్య నైపుణ్యాల నుండి మళ్లించడం ద్వారా, నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణుల కొరతను గణనీయంగా సృష్టిస్తోంది. నేటి సమాజం తరచుగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ( బిటెక్ ) లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ( బిఇ ) డిగ్రీని ఉన్నత స్థాయి విద్య, ఉపాధి మార్గంగాను, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ( ఐటీఐలు ) పాలిటెక్నిక్ డిప్లొమాలు తక్కువ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఎంపికలుగా ముద్ర వేయడంతో మన దైనందిన జీవితంలో అవసరమయ్యే ప్లంబర్లు, ఎలెక్ట్రిషియన్లు, కార్పెంటర్లు, వెల్డర్లు, కమ్మరి, కుమ్మరి, కంసాలి, చేనేత వృత్తి నిపుణులు క్షేత్రస్థాయిలో నానాటికీ తగ్గిపోతున్నారు. ఇది “ అందరూ పల్లకీలో కూర్చుంటే, మోసేదెవరు ? ” అన్న సామెతను గుర్తు తెస్తుంది. ఈ పరిస్థితులలో విద్యార్థులు, తల్లిదండ్రులు, సభ్య సమాజం వైట్ కాలర్ జాబ్స్, గ్రే కాలర్ జాబ్స్ ( ఉచ్ఛ, నీచ ) అనే భావనకు స్వస్తి పలికి వృత్తి నైపుణ్యాన్ని గౌరవించే సంస్కృతి అలవర్చుకుంటేనే సమాజంలోని అన్ని వర్గాల, అన్ని స్థాయిల వ్యక్తులు ప్రశాంతమయ జీవితాన్ని గడపగలుగుతారు. పార్టీల రహితంగా ప్రభుత్వాలు నిర్హేతుకమైన సంక్షేమ పథకాలను రద్దుచేసి దేశాభివృద్ధికి దోహదపడే సాంకేతిక వృత్తి నిపుణులను, శాస్త్రవేత్తలను తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా యుద్ధప్రాతిపదికన కృషి చేయాలి.
ప్రభుత్వ నిరాదరణకు గురవుతున్న మారేడ్ పల్లి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రానిక్స్ :
ఎంతో మంది ప్రముఖ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు కొన్ని దశాబ్దాల పాటు ప్రాథమిక వేదికగా నిలిచిన ఈ ప్రతిష్టాత్మక సంస్థకు నేడు ప్రభుత్వ తోడ్పాటు కరువవుతోందని ఇప్పుడు దాదాపు 60 నుండి 80 సంవత్సరాల వయసులో ఉన్న ఆ సంస్థ పూర్వ విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెటిహెచ్ఎస్ మారేడ్‌పల్లిలో విద్యాభ్యాసం కారణంగానే తమకు ప్రతిష్టాత్మక సంస్థలలో ఉద్యోగావకాశాలు లభించడంతో పాటు ఉన్నత పదవులు పొంది ఆనందమయ జీవితం గడపగలుగుతున్నామని తెలిపారు. కారణాలేమైతేనేమి, సికింద్రాబాద్ కు గుండెకాయ లాంటి ఈస్ట్ మారేడ్ పల్లిలో గల ఈ సంస్థ అత్యంత విలువైన స్థలాన్ని విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. జెటిహెచ్ఎస్ మారేడ్‌పల్లి పూర్వ విద్యార్థులుగా తాము ఈ ప్రతిపాదనను విరమించుకోవాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. గతంలో దివంగత టంగుటూరి అంజయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం 1981లో స్థాపించబడిన MVSR ( Matrusri ) ఇంజనీరింగ్ కళాశాలకు కొన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రయోగశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో జెటిహెచ్ఎస్ మారేడ్‌పల్లి ప్రాంగణంలోని వసతులను ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించింది అని, ఆ తరువాత జెటిహెచ్ఎస్ విద్యార్థులు తీవ్ర ఆందోళన చేయడంతో 1985 లో MVSR ఇంజనీరింగ్ కళాశాల జెటిహెచ్ఎస్ లోని వసతులను వినియోగించుకోవడం ఆగిపోయిందని కొందరు పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ నెల 5వ తేదీన భారత మాజీ రాష్ట్రపతి డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరుపుకునే “ గురు పూజా దినోత్సవం ” నాడు “ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రానిక్స్ ” ( ఒకప్పటి జిటిహెచ్ఎస్ ) మారేడ్‌పల్లిలో “ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ” నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలలో 60 నుండి 80 సంవత్సరాల మధ్య వయసు గల రెండు వందల పై చిలుకు పూర్వ విద్యార్థులు పాల్గొంటారని ప్రముఖ సంఘ సేవకులు, భూగర్భ నీటి సంరక్షకులు, బిహెచ్ఈఎల్ మాజీ జనరల్ మేనేజర్ రాజాపేట ఆంజనేయులు తెలిపారు.
యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్
✆ 8885050822















Leave a Reply