సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధితో పని చేయండి
– సీఎం రేవంత్‌రెడ్డి

నియామక పత్రాలను అందచేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు
తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణలో తరతరాలుగా వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధితో పని చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం జలసౌధ ప్రాంగణంలో నియామకపత్రాల అందజేత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై కొలువుల పండుగలో భాగంగా నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 244 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, (AEE), 199 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ (JTO) లకు రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతున్న ఉద్యోగులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో బతకడానికి అవసరమైన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వాములై ప్రజల భావోద్వేగానికి ప్రతీకలుగా నిలబడాలని సూచించారు. గత నలభై యాభై ఏళ్లుగా రావలసిన నీళ్లు రాకపోగా, పూర్తి కావలసిన ప్రాజెక్టులు పూర్తి కాని కారణంగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, వాయిదా పడుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. నీళ్లు ఎంత అవసరమో అందుకు ఎంతగా పరితపించామో, ఏ నీటి కోసమైతే పోరాటం మొదలైంతో ఆ నీళ్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టాయని, అందుకే నీటి పారుదల శాఖకు ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగైదు దశాబ్దాలు వాయిదా పడిన ప్రాజెక్టులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లలో కూడా పూర్తి కాలేదన్నారు. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైన ప్రాజెక్టులు తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో ఏదీ పూర్తి కాలేదు. ఈనాటికీ వాయిదాలు పడుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలకు అతిపెద్ద సెంటిమెంట్ నీళ్లు. ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పూర్తి చేస్తామని సీఎం అన్నారు.
ఇంజనీర్లుగా మీరు చేపట్టే ప్రాజెక్టులు భవిష్యత్తు తరాలకు అందించాల్సిన భాధ్యత ఉందని, ఇది నెలనెలా జీతం తీసుకునే ఉద్యోగంగా కాకుండా ఒక బాధ్యతగా, ప్రజల భావోద్వేగంగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నారు. పదేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. గత సెప్టెంబర్‌లో ఇదే వేదిక నుంచి 738 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను, జూనియర్ అసిస్టెంట్లకు నియామాక పత్రాలు అందించి భుజం తట్టామని తెలిపారు. మళ్లీ ఈరోజు 443 ఉద్యోగాలను నియమించామని, 14 నెలల కాలంలో ఈ ఒక్క శాఖలోనే 1121 మందిని నియమించామంటే ఈ శాఖకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు, ప్రత్యేక తెలంగాణలో పదేళ్లు నోటిఫికేషన్ల కోసం కొట్లాడామన్నారు. ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత ఉద్యోగ నియామకాలు…14 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు. ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించామని, 3 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులను తీసుకొచ్చామన్నారు. యువతకు విద్య, ఉద్యోగాల కల్పన ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. అడ్డంకులను అధిగమించి తొందరలోనే గ్రూప్ I, II, III, IV నియామకాలు పూర్తి చేస్తామని అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply