2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే
జాబ్ క్యాలెండర్ ఏమైంది ?
జులై 4న నిరుద్యోగులు తలపెట్టిన ఛలో సెక్రటరియేట్ కు మద్దతు
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
హైదరాబాద్, జూన్ 26, అద్దం న్యూస్ : ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్‌రెడ్డి సర్కారు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఐ ( ఎం ) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. జులై 4న తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ తలపెట్టిన హలో నిరుద్యోగి…ఛలో సెక్రటరియేట్ కార్యక్రమానికి మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జులై 4న తలపెట్టిన చలో సెక్రటరియేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు విస్మరించడం..ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు నిరుద్యోగుల సమస్యను అస్ర్తంగా మార్చుకోవడం.. తిరిగి అధికారంలోకి రాగానే నాన్చడం…పాలక పార్టీలకు శరా మామూలుగా మారిందని విమర్శించారు. పీజీలు, పీహెచ్‌డీలు చేసి ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుకుంటూ…సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న విద్యావంతులు సర్కారు కనిపించడం లేదా ? కనిపించినా పట్టనట్టు ఉంటుందా ? అని నిలదీశారు. రాష్ట్రంలో ఇద్దరు నిరుద్యోగులు చనిపోయారని…ఇంకెంత మంది చనిపోవాలి ? ఇక్కెప్పుడు పోస్టులను భర్తీ చేస్తారు ? పాలకులకు నిరుద్యోగుల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి ? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల పోరాటంపై పాలకులు తప్పుడు ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది కాబట్టే ఆ పార్టీని పక్కనబెట్టి కాంగ్రెస్‌కు నిరుద్యోగులు అండగా నిలిచారనే విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కారు గుర్తించుకోవాలని సూచించారు.
జులై నాలుగో తేదీ కంటే ముందే పోస్టుల భర్తీపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. లేకుంటే, నిరుద్యోగుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డమ్మీగా మారుతుందని హెచ్చరించారు. దేశంలో పర్మినెంట్ ఉద్యోగ వ్యవస్థనే ఎత్తివేసే పనిలో మోడీ సర్కారు ఉందని, అందులో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నదన్నారు. ఒకవైపు ఉద్యోగాల భర్తీ కోసం కొట్లాడుతూనే.. మరోవైపు సమాజ మార్పు కోసం తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌డీ.అబ్బాస్, టీపీఎస్‌కే కార్యదర్శి హిమబిందు, డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావీద్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాం నాయక్, చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు బాలకృష్ణ, బీవీఎమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ మోతీలాల్ నాయక్, జేఏసీ నాయకులు సుధీర్, సింధూరెడ్డి, ఖాసీం, నర్సింహ్మ తదితరులు మాట్లాడారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply