...

అహ్మదాబాద్‌లో ఘోర ప్ర‌మాదం – కుప్ప‌కూలిన ఎయిర్ ఇండియా విమానం

అహ్మదాబాద్‌లో ఘోర ప్ర‌మాదం

♦ కుప్ప‌కూలిన ఎయిర్ ఇండియా విమానం

♦ 241 మంది మృతి చెందిన‌ట్టు అధికారుల ధృవీక‌ర‌ణ‌

♦ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఒకే ఒక్క‌డు

వెబ్ డెస్క్‌ అద్దం న్యూస్ :   గుజ‌రాత్ అహ్మ‌దాబాద్‌లోని స‌ర్థార్ వ‌ల్లాభాయ్ ప‌టేల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండ‌న్ బ‌యల్దేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్ప‌కూలింది. ర‌న్ వే నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేప‌టికే మేఘానిన‌గ‌ర్ ఘోడాస‌ర్ క్యాంప్ ప్రాంతంలో విమానం కుప్ప‌కూలింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో విమానంలో 242 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌ అతి సమీపంలో ఓ కాలేజీ హాస్టల్‌ బిల్డింగ్‌పై కూలింది. ఆ తర్వాత భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలో 242 మంది ఉండగా 241 మంది మరణించారు. అలాగే మెడికల్‌ కాలేజ్‌ హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు కూడా కొంతమంది మృతి చెందారు. విమానం టేకాఫ్‌ అయి గాల్లోకి ఎగుతున్న క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పూర్తిగా పైకి వెళ్లకుండా.. కొద్ది సెకన్లలోనే కిందికి దిగుతూ.. కాలేజ్‌ బిల్డింగ్‌పై కూలిపోయింది. దట్టమైన పొగ కమ్ముకుంది. అలా చూస్తుండగానే.. కేవలం 32 సెకన్లలోనే ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం పూర్తిగా భస్మం అయిపోయింది. కొన్ని నిమిషాల ముందు ఎంతో సంతోషంగా ఉన్న ప్రయాణికులు, పైలెట్లు, సిబ్బంది.. జీవితాల్లో గాల్లో కలిసిపోయాయి.

ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఒకే ఒక్క‌డు :

ఈ ప్రమాదం నుంచి కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విశ్వాస్ కుమార్ రమేష్ (40) అనే వ్యక్తి విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయట పడ్డాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించిన అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. 11ఏ సీటు బుక్‌ చేసుకొని.. లండన్‌ వెళ్తున్న రమేష్‌ అనే వ్యక్తి అదృష్టం కొద్ది బతికిబట్టకట్టాడు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఇప్పటికే టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే గాయపడిన వారి వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని, ప్రమాదంలో దెబ్బతిన్న మెడికల్‌ కాలేజ్‌ బిల్డింగ్‌ను కూడా పునఃనిర్మిస్తామని కూడా వెల్లడించారు.

ట్రాఫిక్ జామ్‌లో చిక్కి… మ‌హిళ‌కు త‌ప్పిన ప్ర‌మాదం :

ఈ విమాన దుర్ఘటన నుంచి భూమి చౌహాన్ అనే మహిళ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. వాస్తవానికి ఆమె ఈ ఎయిరిండియా ఫ్లైట్ ( AI-171 ) ఎక్కాల్సి ఉంది. కానీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ఆమె ఎయిర్‌పోర్టుకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఫ్లైట్ మిస్ అయింది. కేవలం 10 నిమిషాల తేడాతో మిస్ అయ్యానని.. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నానని ఆమె జాతీయ మీడియాతో తెలిపింది. తాను విమానం మిస్ అయ్యిపోయానని తెలిశాక సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయటకు వచ్చేశాను. ఇక లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం మధ్యాహ్నం 1.38 గంటలకు ఎయిర్‌పోర్టు సమీపంలో కుప్పకూలిన న్యూస్ విని.. పూర్తిగా కుంగిపోయాను. ‘నా శరీరం అంతా వణికిపోయింది. దేవుడికి నేను రుణపడి ఉంటా. గణపతి దేవుడే రక్షించాడని’ అని ఆమె చెప్పింది. వెకేషన్ కోసం తాను వచ్చానని, ఈ ఘటన తనను దిగ్బ్రాంతికి గురి చేసిందని.. ఆలోచిస్తుంటేనే.. వణుకు పుడుతోందని ఆమె జాతీయ మీడియాతో చెప్పుకొచ్చింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.