ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్ని విడుదల చేయాలి
లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతిమ గడియలే
– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, జూలై 1, ( అద్దం న్యూస్ ) : పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని, తక్షణమే ఫీజు బకాయిలన్నింటిని విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతిమ గడియలే అని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోతే కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో తేల్చుకుంటామని, ఫీజులు ఇస్తారా… గద్దె దిగుతారా ఇక మీ ఇష్టం అని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బాకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌తో బిసి సంక్షేమ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడుతూ… తెలంగాణ బీసీ విద్యార్థి, యువజన సంఘం ఆధ్వర్యంలో ఈనెల 2న ( నేటి ) రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కళాశాలల బంద్ విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. బంద్ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 15న వేలాది మంది విద్యార్థులతో ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. ఆంధ్ర ప్రభుత్వాన్ని చూసిన తెలంగాణ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలన్నారు. బడుగు విద్యార్థులను ఉన్నత విద్య నుండి ప్రభుత్వం పంపించే కుట్ర చేస్తుందని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. 2008లో ప్రజల ఉద్యమాల ఫలితంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమల్లోకి వచ్చిందని, భారత రాజ్యాంగం కల్పించిన విద్యా హక్క ప్రతి పేద విద్యార్థికి అందాలనే లక్ష్యంతో ఈ ఫథకాన్ని ప్రారంభించారన్నారు. 10,000 ర్యాంక్ నిబంధన, ఆధాయ పరిమితి, కేటగిరీల పరిమితులు, స్పాట్ అడ్మిషన్లకు నిరాకరణ వంటి నిబంధనలతో అర్హులైన వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారన్నారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో– చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వరరావు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జావిద్, బీజేవైఎం అధికార ప్రతినిధి సురేష్ గౌడ్, బిఆర్ఎస్‌వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరసింహ నాయక్, ఓయూ జేఏసీ చైర్మన్ మాలింగ లింగస్వామి, బిసి సంఘం నాయకులు వెంకటస్వామి గౌడ్, మాదేశి రాజేందర్, గూడూరు భాస్కర్ మేరు, బిఆర్ఎస్‌వి నాయకుడు ప్రశాంత్ గౌడ్, బిసి విద్యార్థి సంఘం గుంటి మహేష్ మేరు, బిఆర్ఎస్‌వి శ్రీకాంత్ ముదిరాజ్ అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేటి బందుకు మద్దతుగా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ ప్రతినిధులు సూర్యనారాయణ రెడ్డి, (పాతి) ఫెడరేషన్ అసోసియేషన్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ మద్దతు తెలియజేశారు.![]()

![]()












Leave a Reply