గుడి మల్కాపూర్ మార్కెట్‌లో
‘ అరైవ్ అలైవ్ ’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం
గుడి మల్కాపూర్, ఆగస్టు 30, ( అద్దం న్యూస్ ) : కుల్సుంపురా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడి మల్కాపూర్ మార్కెట్ ఆవరణలో ‘ అరైవ్ అలైవ్ ’ ( Arrive Alive ) రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా ఆదివారం మార్కెట్ కమిటీ సభ్యులు, నాలుగు చక్రాల వాహన డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో వాహనదారులు, డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాల్సిన కీలక నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కుల్సుంపురా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ( DL ) లేకుండా ఎలాంటి వాహనాన్ని నడపకూడదన్నారు. మైనర్లకు ( మైనారిటీ తీరని పిల్లలకు ) వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం అని, తల్లిదండ్రులు, యజమానులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదన్నారు.
ద్విచక్ర వాహనదారులు తమ ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమన్నారు. ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయడం ప్రమాదకరమని… కేవలం అనుమతించబడిన మార్గాల్లో, నిబంధనల ప్రకారం సురక్షితంగా మాత్రమే ఓవర్‌టేక్ చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు, పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యంత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, సురక్షితమైన ప్రయాణానికి సహకరించాలని కోరారు.![]()

![]()

