నీట మునిగిన శ్రీరాంనగర్ బస్తీలో నివారణ చర్యలు చేపట్టడంలో అధికారుల వైఫల్యం
– డివైఎఫ్ఐ
హైదరాబాద్, సెప్టెంబర్ 18, అద్దం న్యూస్ : నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్ బస్తీ, కమాన్ బస్తీ నీటిలో మునిగి, బస్తీవాసుల ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జిహెచ్ఎంసి అధికారులు తక్షణమే నివారణ చర్యలు చేపట్టడంలో తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నారని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్ఐ ) విమర్శించింది. గురువారం నాడు వర్షపు నీటిలో మునిగిన శ్రీరాంనగర్ బస్తీని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బస్తీ ప్రజలను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్ ఆనగంటి వెంకటేశులు మాట్లాడుతూ… గత అనేక ఏండ్లుగా వర్షాలకు శ్రీరామ్‌నగర్ బస్తీ నీట మునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వారన్నారు. ఇతర లోతట్టు ప్రాంతాల్లోనూ ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతున్నాయన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతుందన్నారు. వర్షా కాలంలో వర్షపు నీటితో పాటు, హుస్సేన్ సాగర్ నుండి ప్రవహించే వరద నీళ్ళ ప్రవాహం శ్రీరామ్ నగర్ బస్తీలోని ఇండ్లలోకి వస్తున్న విషయాన్ని కాలనీవాసులు ప్రభుత్వ అధికారులకు విన్నవించినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలన్నారు. వర్షపు నీళ్ళు, మురికి నీళ్లతో విషపు జ్వరాలు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. భారీగా కురిసిన వర్షానికి ఇండ్లలోకి చేరిన నీటి వల్లన కొందరిండ్లలో నిత్యవసర వస్తువులు సరుకులు తడిచాయని అన్నారు. శ్రీరామ్ నగర్ బస్తీ, కమాన్ బస్తీలో నెలకొన్న సమస్యకు అధికారులు, ప్రజా ప్రతినిధులు శాశ్వత పరిష్కారం చూపాలని, అధికారులు నిర్లక్ష్యం విడనాడాలన్నారు. నగరంలో లోతట్టు ప్రాంతాల్లో వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. కాలనీవాసులకు వర్షపు నీళ్ళు, నాలా ప్రవాహం నుండి ఇబ్బందులు తలెత్తకుండా నివారణ చర్యలు చేపట్టాలని లేని ఎడల కాలనీవాసులని సమీకరించి జిహెచ్ఎంసి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నగర కార్యదర్శి ఎండి.జావిద్, రాజ్ కుమార్, ప్రజాసంఘాల నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply