...

సందేహాలను నివృత్తి చేసిన త‌ర్వాత‌నే ప్రభుత్వం మూసీ ప్రాజెక్టును చేపట్టాలి

సందేహాలను నివృత్తి చేసిన త‌ర్వాత‌నే ప్రభుత్వం మూసీ ప్రాజెక్టును చేపట్టాలి
– రౌండ్ టేబుల్ స‌మావేశంలో వ‌క్త‌లు

హైద‌రాబాద్‌, జూలై 11, ( అద్దం న్యూస్ ) :   బాధితుల సందేహాలను నివృత్తి చేసిన త‌ర్వాత‌నే ప్రభుత్వం మూసీ ప్రాజెక్టును చేపట్టాలని వ‌క్త‌లు డిమాండ్ చేశారు. శ‌నివారం హైదరాబాద్‌లోని ల‌క్డీకాపూల్‌ హోటల్ సెంట్రల్ కోర్ట్‌లో మూసీ ప్రాజెక్టు, దానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ రాష్ట్ర లోక్ దళ్ ( టీఆర్ఎల్‌డి ) పార్టీ ఆధ్వ‌ర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జ‌రిగింది. తెలంగాణ రాష్ట్ర లోక్ దళ్ ( టీఆర్ఎల్‌డి ) పార్టీ రాష్ట్ర‌ అధ్య‌క్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ అధ్యక్షతన జ‌రిగిన‌ ఈ సమావేశానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మ‌ల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్, ప్రొఫెసర్ హరగోపాల్ త‌దిత‌రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ట్రెకార్ మాజీ చైర్మన్ బెల్లయ్య నాయక్, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి, మన్నారం నాగరాజు, కర్నాటి మనోహర్, మాజీ ఎమ్మెల్యే వర్ణాల శ్రీరాములు, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ… తన చిన్నతనంలో నడుము దాకా మూసీలో నీళ్లు ఉండేవని, ఇప్పుడు పారిశ్రామిక వ్యర్థాలు, డ్రైనేజీ నీరు తప్ప మూసీలో ప్రవాహమే లేదని అన్నారు. పారిశ్రామిక వ్యర్ధాలను అరికట్టడం, మరిన్ని ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసి మూసీని శుద్ధి చేయడం, డ్రైనేజీ ఇన్ఫ్రాను అడ్డుకోవడం, క్యాచ్మెంట్ ఏరియాను పునరుద్దరించడం, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం వంటి అంశాలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పరిగణించాలని సూచించారు. ఇటీవల కాలంలో టీఆర్ఎల్‌డి నిర్వహించిన ఫ్యూచర్ సిటీ, హైడ్రా, మూసీ పునరుద్ధరణ అంశాలపై వివిధ వర్గాల అభిప్రాయాలను క్రోడీకరించి ముఖ్యమంత్రిని నివేదికలతో కలిసి కలుస్తామని తెలిపారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ… తమ మల్కాజిగిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో మూసి బాధితులు ఉన్నారని, వారి ఆక్రందనలు, సమస్యలకు సరైన పరిష్కారం చూపించిన తరువాతనే ప్రభుత్వం మూసీపై గానీ, హైడ్రాపై గానీ ముందుకు సాగాలని, ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించని ఏ అభివృద్ధి అయినా వ్యర్థమేనని అన్నారు. కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ… నిర్వాసితుల పునరావాసం, సరైన నష్టపరిహారం, వివిధ ప్రజా సంఘాలు లేవనెత్తిన సందేహాల నివృత్తి అనంతరమే ప్రభుత్వం మూసీ ప్రాజెక్టును చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్ మాట్లాడుతూ…. లక్ష యాభై వేల కోట్ల అంచనా వ్యయంతో కూడిన ప్రాజెక్టును, జీతాలు, పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వలేని ప్రభుత్వం ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టుకు అసలు పబ్లిక్ హియరింగ్ నిర్వహించలేదని, ఇక నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసించగలమని అన్నారు. ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ… ప్రతి ఊరిలో మైసమ్మలు మిగిలి, కట్టలు, చెరువులు మాయమైపోయాయని, ఒకప్పుడు వరదలతో ప్రవహించిన మూసీ నది నేడు మురికి కూపంగా మారిందని అన్నారు. తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ… సోషియల్ ట్రీట్మెంట్ ప్లాంట్లు విరివిగా నెలకొల్పాలని, పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లోకి వదలకూడదని అభిప్రాయపడ్డారు. మన్నారం నాగరాజు మాట్లాడుతూ… హైదరాబాద్ సెంట్రల్లోని మలక్పేట్ రేస్ కోర్స్కు చెందిన 103 ఎకరాలను మూసీ నిర్వాసితులకు కేటాయించి, అక్కడ వెర్టికల్ స్ట్రక్చర్లు నిర్మించి అందరికీ పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్ణాల శ్రీరాములు మాట్లాడుతూ… అందరూ మూసీ పునర్జీవ ప్రాజెక్టును స్వాగతిస్తున్నప్పటికీ, డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై చర్చించడం కష్టమని అన్నారు.

ట్రైకార్ మాజీ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ… నిర్వాసితులకు ఆశ్రయం కల్పించకుండా, సరైన నష్టపరిహారం ఇవ్వకుండా ఈ ప్రాజెక్టును గ్రౌండ్ చేయవద్దని అన్నారు. కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ… ఈ సమావేశంలో నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రికి నివేదిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎల్‌డి పార్టీ ఉపాధ్య‌క్షుడు కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, ప్ర‌వ‌క్త‌ బీరప్ప, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విశాల్, కార్య‌ద‌ర్శి ఓంకార్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నరసింహారావు, రిషభ్ జైన్, కోశాధికారి గిరి కుందే, రాష్ట్ర యువ‌జ‌న అధ్య‌క్షుడు బుల్లెట్ వెంకన్న, నాయ‌కులు రాజ్ కుమార్‌, కోటేశ్వర్, శ్రీనివాస్, విక్రమ్, టేగ్, కిరణ్, మల్లేష్ గౌడ్, మాడు సత్యం గౌడ్, కర్నాటి మనోహర్, వ‌రంగ‌ల్ జిల్లా అధ్య‌క్షుడు రాంప్రసాద్, జనగాం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, ప్రముఖ సామాజికవేత్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.