ఉరివేసుకొని బైక్ డ్రైవ‌ర్‌ ఆత్మ‌హ‌త్య‌

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :    ఆర్థిక సమస్యలతో ఓ సంస్థ‌లో ప‌ని చేస్తున్న బైక్ డ్రైవ‌ర్ ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి… ప‌రుశురామ్ ( 46 ) అనే వ్య‌క్తి త‌న భార్య‌, ఇద్ద‌రు కూత‌ర్ల‌తో క‌లిసి అడిక్‌మెట్ డివిజ‌న్ ప‌ద్మాకాల‌నీలో నివ‌స్తుంటాడు. వృత్తిరీత్యా ఓ సంస్థ‌లో ద్విచ‌క్ర వాహ‌నం న‌డుపుకుంటూ ప్ర‌యాణికుల‌ను పిక‌ప్, డ్రాపింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండ‌గా వ‌చ్చే ఆదాయం స‌రిపోక‌పోవ‌డంతో ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం సాయంత్రం ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరివేసుకొని ప‌రుశురామ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వ‌చ్చిన పిల్ల‌లు త‌లుపు తీసే ప్ర‌య‌త్నం చేయ‌గా లోప‌ల నుంచి గ‌డియ‌పెట్టి ఉంది. ఎంత‌కీ త‌లుపు తీయ‌క‌పోవ‌డంతో వారు త‌మ త‌ల్లికి స‌మాచారం ఇవ్వ‌డంతో ఆమె వ‌చ్చి కొంత మంది స‌హాయంతో త‌లుపుల‌ను ప‌గుల‌కొట్టి లోనికి వెళ్లి చూడ‌గా ప‌రుశురామ్ ఉరివేసుకొని వేలాడుతూ క‌నిపించాడు. స్థానికుల ద్వారా స‌మాచారాన్ని తెలుసుకున్న చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని కింద‌కు దింపి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆర్థిక ఇబ్బందుల‌తోనే ప‌రుశురామ్ ఆత్మ‌హ‌త్య చేసుకొని ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page