కార్మిక సంఘాల చేరికతో బలోపేతమైన బీఆర్‌టీయూ
హైదరాబాద్, జూలై 20, ( అద్దం న్యూస్ ) : కార్మిక సంఘాల చేరికతో బీఆర్‌టీయూ బలోపేతమైనదని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ లు అన్నారు. తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్‌కు చెందిన దేవానంద్, రామన్న, ఎయిర్‌టెల్ రాజు, పరమేశ్వర్, హరిబాబు, లక్ష్మణ్, శోభా తదితరులు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్‌లో చేరారు. సోమవారం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ నాయకుల విలీన సభ హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ లు బీఆర్‌టీయూ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ… కార్మికులు, పేదల సంక్షేమాన్ని కాపాడిన కేసీఆర్ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు మరోసారి కోరుకుంటున్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణే భారత రాష్ట్ర సమితి సిద్ధాంతమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, పేదలు సహా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాయని, ప్రస్తుతం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ఉద్యోగుల జీతాలు, ప్రమోషన్లు, సంక్షేమ సమస్యలను యాజమాన్యాలతో చర్చించి పరిష్కరించామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యం ప్రత్యేక రాష్ట్రంతో ముగియలేదని, పేదలు, కార్మికులు, రైతులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే అసలు లక్ష్యమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మైనారిటీ విద్యాసంస్థలు, వసతి గృహాలను బలోపేతం చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించామని, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ప్రజల మద్దతుతో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాంబాబు యాదవ్, మారన్న, నారాయణ, రాజు యాదవ్, ఆంజనేయులు, రామకృష్ణ వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.













Leave a Reply