మహిళలకు ‘ ఉచిత బస్సు ‘ అని చెప్పి… ట్రాఫిక్ చలాన్ల రూపంలో జేబులు కత్తిరిస్తున్నారు
» కాంగ్రెస్ సర్కార్‌పై తెలుగుదేశం పార్టీ నేతల నిప్పులు
హైదరాబాద్, జనవరి 6, అద్దం న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలపై తెలుగుదేశం పార్టీ నగర నాయకులు నల్లెల్ల కిషోర్, నాగు నగేష్, పి. బాలరాజగౌడ్ లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్రాఫిక్ చలాన్లను తప్పుపట్టిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంతకంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి జిల్లా కార్యాలయంలో వారు మంగళవారం మాట్లాడుతూ… మాట తప్పిన ముఖ్యమంత్రి అడ్డగోలుగా చలాన్లు వసూళ్లు చేస్తున్నారని.. నాడు విమర్శ చేసి నేడు అమలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ల పేరుతో ప్రజలపై జులుం చేస్తోందని, పోలీసులు దొంగచాటుగా ఫోటోలు తీస్తున్నారని విమర్శించిన రేవంత్ రెడ్డి, నేడు తాను అధికారంలోకి వచ్చాక అదే పనిచేస్తున్నారని నాయకులు మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఇంటిలో చలాన్ లేని బండి ఒక్కటి కూడా కనిపించడం లేదని, ప్రతి కుటుంబం నుండి ఒక్కో వాహనంపై వేల రూపాయల చలాన్లు వసూలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, మరోవైపు చలాన్ల రూపంలో ఉచితం కంటే 2–3 రెట్లు అధికంగా లాక్కుంటోందని ధ్వజమెత్తారు.
నియంత్రణ కంటే వసూళ్లే ముఖ్యం అన్నట్లుగా ప్రభుత్వం ట్రాఫిక్ నియంత్రణను పూర్తిగా గాలికి వదిలేసిందని, కేవలం వసూళ్లపైనే దృష్టి సారించిందని వారు ఆరోపించారు. ప్రతి కూడలి వద్ద 10 మంది పోలీసులు ఉండి కేవలం చలాన్ల కోసమే వేచి చూస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగత ఫోన్లతో ఫోటోలు తీసి చలాన్లు వేయవద్దని కోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా, పోలీసులు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ చాటు మాటుగా ఫోటోలు తీసి ప్రజలపై జులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధ్వాన్నమైన, పాడైపోయిన రోడ్లను మరమ్మత్తు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, రోడ్ల దుస్థితి, సరైన ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వారు వాపోయారు. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని, లోన్లు ఇస్తామని అమలుకాని హామీలు ఇచ్చి, ఇప్పటి వరకు ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదని నాయకులు గుర్తు చేశారు. పథకాలు అమలు చేయకుండానే ఇతర మార్గాల్లో ప్రజల జేబులు కత్తిరిస్తున్నారని విమర్శించారు. వాహనదారులపై ఉన్న ట్రాఫిక్ చలాన్లను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ దోపిడీని ఆపకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నాయకులు ఎస్.ప్రకాష్, కరణం కిరణ్, తడక వినోద్, అనిల్ కురుమ, శ్యామ్ సుందర్, ఎ.వెంకటేష్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply