హైదరాబాద్ బ్యూరో, నవంబర్ 5, ( అద్దం న్యూస్ ) : మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలు, పోక్సో కేసుల్లో బాధితులకు వేగంగా న్యాయం చేకూరాలంటే పోలీసులు, వైద్యుల మధ్య మెరుగైన సమన్వయం అత్యంత ఆవశ్యకమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో గురువారం నగరంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన సుమారు 34 మంది వైద్యాధికారులతో ఆయన ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. దర్యాప్తు ప్రక్రియలోనూ, న్యాయస్థానాల్లో నేరం నిరూపించడంలోనూ వైద్యులు ఇచ్చే నివేదికలే అత్యంత కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోక్సో, అత్యాచార కేసుల్లో నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు పడాలంటే కోర్టుల్లో సకాలంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. బాధితులకు వైద్య పరీక్షలను త్వరితగతిన పూర్తి చేసి, సమగ్ర వైద్య నివేదికలను సకాలంలో పోలీసులకు అందజేస్తే గడువులోగా ఛార్జ్‌షీట్ వేయవచ్చని సూచించారు.
సోషల్ మీడియా దుర్వినియోగం, తదితర కారణాలతో 13 నుంచి 14 ఏళ్ల బాలికలు కూడా మోసపోయి నేరాల బారిన పడుతున్నారని, దీనిపై పాఠశాలల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్, విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఆసుపత్రులకు విచారణ నిమిత్తం వచ్చే పోలీసుల వల్ల వైద్యుల విధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రధాన ఆసుపత్రుల్లో ప్రత్యేక సిబ్బందిని సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా నియమిస్తామని తెలిపారు. అలాగే పోలీసుల తరఫున ఒక లైజన్ అధికారిని కేటాయించి సమాచార మార్పిడిని వేగవంతం చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి డీసీపీ స్థాయి అధికారులతో వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నామని, అత్యవసర సమయాల్లో వైద్యులు నేరుగా పోలీస్ ఉన్నతాధికారులను సంప్రదించవచ్చని చెప్పారు. నేరం జరిగినప్పుడు చట్టం వేగంగా స్పందించినప్పుడే బాధితులకు భరోసా, నేరస్థుల్లో భయం కలుగుతాయని స్పష్టం చేశారు.
కాగా, క్షేత్రస్థాయి అనుభవాలు, విధుల్లో ఎదురవుతున్న పలు అంశాలను వైద్యులు సీపీ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి వైద్యులకు పూర్తి సహకారం అందేలా చూస్తామని, ఎలాంటి ఆటంకాలు లేకుండా పరస్పర సమన్వయంతో ముందుకెళ్లేలా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు సీపీ ( క్రైమ్స్ ) ఎం.శ్రీనివాసులు, డీసీపీ విమెన్ సేఫ్టీ వింగ్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.






