Friday, November 6, 2026
No menu items!
HomeGREATER HYDERABADహైద‌రాబాద్‌ను కామ‌ధేనువుగా వాడుకుంటూ అక్ర‌మ సంపాద‌న పెంచుకుంటున్న సీఎం, ఆయ‌న కుటుంబ స‌భ్యులు – తెలంగాణ...

హైద‌రాబాద్‌ను కామ‌ధేనువుగా వాడుకుంటూ అక్ర‌మ సంపాద‌న పెంచుకుంటున్న సీఎం, ఆయ‌న కుటుంబ స‌భ్యులు – తెలంగాణ ర‌క్ష‌ణ సేన అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్ బ్యూరో, న‌వంబ‌ర్ 5, ( అద్దం న్యూస్ ) :     హైదరాబాద్ నగరాన్ని ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు కామధేనువుగా వాడుకుంటూ అక్రమ సంపాదన పెంచుకుంటున్నారని తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. న‌గరంలో రోడ్లు, బస్తీ దవాఖాలు, మంచినీళ్లు సరిగా లేని పరిస్థితి పక్కన పెట్టి అక్రమ సంపాదనపైనే సీఎం దృష్టి పెట్టారని ధ్వ‌జ‌మెత్తారు. నగరంలో ఎటు చూసినా భూములు, పర్మిషన్లు, టీడీఆర్ పేరుతో అక్రమ దందాలే కనిపిస్తున్నాయన్నారు. అయ్యప్ప సోసైటీలో విచ్చలవిడిగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారని విమ‌ర్శించారు. హైద‌రాబాద్ బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర‌ కార్యాలయంలో మీడియాతో క‌విత‌ మాట్లాడుతూ… అయ్యప్ప సోసైటీలో సీఎం, ఆయన కుటుంబ సభ్యులు అక్రమ దందాలు చేస్తున్నార‌న్నారు. హైకోర్టు ఆర్డర్ ను లెక్కచేయకుండా అక్రమ పర్మిషన్లు ఇప్పిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక అక్రమంగా 500-700 వందల అక్రమ భవనాలు నిర్మించారని, ఎక్కువ దోపిడీ చేస్తే ప్రకృతి కూడా క్షమించదు.. శిక్షిస్తుందన్నారు.

నెల రోజుల్లో అయ్యప్ప సోసైటీలోని అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే మేమే వెళ్లి అక్రమ భవనాలకు రెడ్ మార్క్ వేస్తామ‌న్నారు. భూదాన్ ఉద్యమం స్ఫూర్తితో తెలంగాణ విద్యార్థులకు మంచి చదువు చెప్పించాలని అయ్యప్ప సోసైటీలో 150 ఎకరాలతో గురుకుల ట్రస్ట్ బోర్డు ఏర్పాటైందని, ఆ భూముల విషయంలో ట్రస్ట్ ఛైర్మన్ విఠల్ రావు వాటిని కాపాడేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారని, కానీ ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున అక్రమ భవనాలను నిర్మిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయ్యప్ప సోసైటీలోని ఖానామెట్ లో 5 వందల నుంచి 7 వందల అక్రమ భవనాలు వచ్చాయన్నారు. ఇప్పుడు కూడా దాదాపు 80 భవనాలు నిర్మాణంలో ఉన్నాయని, కేవలం నోటరీ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తూ…10 ఫ్లోర్ల వరకు పర్మిషన్లు ఇస్తున్నారన్నారు. రెండు భవనాల మధ్య కనీసం అగర్ బత్తి పట్టేంత స్థలం కూడా లేదన్నారు. సర్వే నంబర్ 11/ 18 నుంచి 44 వరకు వరుసగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, సర్వే నంబర్ 12 లో 12 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు ? ఈ విషయాలపై ఏ రాజకీయ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు ? అని క‌విత ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి ఇంటికి దగ్గర్లో ఉన్న ఖానామెట్ లో అక్రమ బిల్డింగ్ నిర్మిస్తుంటే ఎందుకు ఆపటం లేదన్నారు. ఓ న్యూస్ పేపర్ అక్కడ ఉన్న అక్రమ భవనాలను గూగుల్ మ్యాప్ తో సహా ట్యాగ్ చేసి న్యూస్ రాసిందని, దాన్ని నేను ట్యాగ్ చేసిన తర్వాత ఎంతో మంది మీడియా వాళ్లు ఆ న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లారని…కానీ అక్కడ ఉన్న ఓనర్లు మీడియా వాళ్లను బెదిరిస్తూ భయపెడుతున్నారన్నారు. మీడియాను కూడా బెదిరిస్తూ మా వెనుక ప్రభుత్వం ఉందని ఆ ఇంటి ఓనర్లు చెబుతున్నారంట అని.. అంటే కాంగ్రెస్ నడుపుతున్నది ప్రభుత్వమా ? రౌడీ రాజ్యమా ? క‌విత దుయ్య‌బ‌ట్టారు.

మంథని నియోజకవర్గంలో బొగ్గు బాయి రాకముందే, కనీసం సర్వే కూడా కాకముందే శాత్రాజుపల్లి అనే గ్రామంలో అర్థరాత్రి 374 ఇళ్లు కూల్చేశారని, మరి హైదరాబాద్ లో ఇంత అక్రమంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతుంటే ఏం చేస్తున్నారు ? అన్నారు. ఇక రాష్ట్రానికి అమిత్ షా వచ్చి రాజకీయాలు మాట్లాడారు కానీ… మన దగ్గర 320 మండలాల్లో కరువు ఉంటే ఆయనేదో సాయం చేస్తారని భావించామ‌న్నారు.. కానీ కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా చేసిందని కౌంటర్ గా హైదరాబాద్ లో ధర్నా చేశారన్నారు. రాష్ట్రానికి, హైదరాబాద్ కు ఒక్క పైసా ఇవ్వలేదు గానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారంట ! అని ఎద్దేవా చేశారు. దేశంలో 13 కోట్ల మంది విదేశీయులు ఉన్నారని అమిత్ షా చెబుతున్నారని, అంటే గతంలో అదే విదేశీయుల ఓట్లతో గెలిచారా.. ఇలాంటి అబద్దాలు చెప్పి ప్రజలను ఎందుకు మోసం చేస్తారని క‌విత ప్ర‌శ్నించారు. నా దగ్గర ఒక్క ఇంచు అసైన్డ్ భూమి, ఇనాం భూమి ఉన్న సరే ప్రభుత్వానికే ఇచ్చేస్తా అని స్ప‌ష్టం చేశారు. గోదావరి, కృష్ణా నీళ్లను ఎత్తిపోయకుండా ఇప్పుడు నీళ్లు లేవని ముఖ్యమంత్రి చెబుతున్నాడని.. పంటలు వేయవద్దని సీఎం చెబుతుంటే అలా చెప్పలేదని తుమ్మల చెబుతున్నాడని.. అంటే వీళ్ల మధ్యే సయోధ్య లేదు. వీళ్ల కారణంగా రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉందన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మహిళ ఓటర్లు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకొని టీఆర్ఎస్ కు అండగా ఉండాలన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page