కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ ఆమోదం.. త్వరలో మరో ఉప ఎన్నిక..!
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ మహిళా నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. దీంతో ఆమె అధికారికంగా మండలి సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ మేరకు మంగళవారం మండలి కార్యదర్శి వి.నర్సింహాచార్యులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కవిత 2021 డిసెంబరులో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికై.. 2022 జనవరిలో బాధ్యతలు చేపట్టారు.
పార్టీలోని కీలక నేతలు హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులను లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన విమర్శలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. క్రమశిక్షణారాహిత్యం కారణంతో గత సెప్టెంబరులో పార్టీ ఆమెను సస్పెండ్ చేయగా.. అదే రోజు కవిత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటంపై పునరాలోచించుకోవాలని ఛైర్మన్ ఆమెకు సూచించారు. ఇటీవల కవిత స్వయంగా మండలికి వచ్చి ప్రసంగించి, తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని చైర్మన్‌ను కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఛైర్మన్ తుది నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజీనామాకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మరో రెండేళ్ల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేయటంతో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈ మేరకు మండలి కార్యదర్శి వి నర్సింహాచార్యులు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply