...

దొంగ‌త‌నం కేసును చేధించిన దోమ‌లగూడ పోలీసులు – ఇద్ద‌రు నిందితుల అరెస్ట్‌, రూ.17 ల‌క్ష‌ల న‌గ‌దు స్వాధీనం

హైదరాబాద్, జూన్ 26, అద్దం న్యూస్ :   దొంగ‌త‌నం కేసును దోమ‌ల‌గూడ పోలీసులు చేధించారు. ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేసి, రూ.17 ల‌క్ష‌ల న‌గ‌దును, రెండు మొబైల్ ఫోన్లు, ద్విచ‌క్ర వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్ట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను డిసిపి కార్యాల‌యంలో అడిష‌న‌ల్ డిసిపి ఆనంద్, గాంధీన‌గ‌ర్ ఏసిపి యాద‌గిరి, దోమ‌ల‌గూడ పోలీస్‌స్టేష‌న్ సిఐ శ్రీనివాస్‌రెడ్డి, డిఐ ఎం.మ‌ల్లేశం ల‌తో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సెంట్ర‌ల్ జోన్ డిసిపి శిల్ప‌వ‌ల్లి వెల్ల‌డించారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలోని ఆనంద్ నగర్‌కు చెందిన గోపాల్ త‌పారియా ( 38 ) వృత్తి రీత్యా చిట్ ఫండ్ వ్యాపారం చేస్తుంటాడు. మన్భావన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చిట్ ఫండ్ వ్యాపారాన్ని అబిడ్స్, రాణిగంజ్‌లలో శాఖలను కొన‌సాగిస్తున్నాడు. ఆయ‌న వ‌ద్ద ముసారాంబాగ్‌కు చెందిన జెథిన్ రాజ్ యాద‌వ్ ( 21 ) క‌లెక్ష‌న్ బాయ్‌గా చేస్తున్నాడు. గోపాల్ త‌పారియా వ‌ద్ద జెథిన్ రాజ్ యాద‌వ్ గ‌త ఆరు నెల‌ల నుంచి క‌లెక్ష‌న్ బాయ్‌గా ప‌ని చేస్తున్నాడు. ఇదిలా ఉండ‌గా 25వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు జూబ్లీహిల్స్‌కు వెళ్లి పంక‌జ్ అగ‌ర్వాల్ నుంచి రూ.17 ల‌క్ష‌ల న‌గ‌దును తీసుకురావాల‌ని ఆబిడ్స్ కార్యాల‌యం నుంచి జెథిన్ రాజ్ యాద‌వ్‌ను గోపాల్ త‌పారియా ఆదేశించాడు. అదే రోజు రాత్రి 7 గంట‌ల‌కు పంక‌జ్ అగ‌ర్వాల్ నుంచి రూ.17 ల‌క్ష‌ల న‌గ‌దును బ్యాగ్‌లో నింపుకున్న‌ జెథిన్ రాజ్ యాద‌వ్ కు రాత్రి 8:20 గంట‌ల‌కు గోపాల్ ఫోన్ చేసి ఎక్క‌డున్నావ్.. డ‌బ్బులు తెస్తున్నావా అని అడిగాడు. హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో ఉన్నాను.. 15 నిమిషాల్లో చేరుకుంటాన‌ని జెథిన్ చెప్పాడు. 20 నిమిషాల త‌ర్వాత జెథిన్ రాజ్ యాద‌వ్‌కు గోపాల్ ఫోన్ చేయ‌గా జెథిన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వ‌చ్చింది. అత‌ను త‌న తండ్రిని సంప్ర‌దించ‌గా జెతిన్ అప్ప‌ర్ ట్యాంక్‌బండ్ వ‌ద్ద ప్ర‌మాదంలో ప‌డిపోయాడ‌ని, న‌గదు ఉన్న బ్యాగ్ క‌నిపించ‌డంలేద‌ని స‌మాచారం వ‌చ్చింది. న‌గ‌దు దొంగ‌త‌నం జ‌రిగిన‌ట్టు గుర్తించిన గోపాల్ త‌పారియా ఈ నెల 26వ తేదీ రాత్రి ఒంటి గంట‌కు దోమ‌ల‌గూడ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. విచార‌ణ‌లో భాగంగా అప్ప‌ర్ ట్యాంక్‌బండ్ పై ప్ర‌మాదం జ‌రిగిందా లేదా ధృవీక‌రించ‌డానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సిసి పుటేజీల‌ను ప‌రిశీలించ‌గా రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు జెథిన్ రాజ్ యాద‌వ్ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు ఒక క‌థ‌ను సృష్టించాడ‌ని పోలీసులు గుర్తించారు. విచార‌ణ‌లో భాగంగా పంక‌జ్ అగ‌ర్వాల్ నుంచి రూ.17 ల‌క్ష‌ల న‌గ‌దు బ్యాగ్‌ను మ‌ల‌క్‌పేట్ ఆనంద్‌న‌గ‌ర్‌కు చెందిన సౌద అభిలాష్ ( 18 ) కు అంద‌చేశాడు. అనంత‌రం జెథిన్ రాజ్ యాద‌వ్ త‌న‌కు ప్ర‌మాదం జ‌రిగింద‌ని గాంధీ ఆసుప‌త్రికి వెళ్లి అక్క‌డి నుంచి పిఎస్‌కు వెళ్లాడు. అత‌ని పై పోలీసుల‌కు అనుమానం రావ‌డంతో స‌రైన రీతిలో విచారించ‌గా దొంగ‌త‌నం చేసిన‌ట్టు జెథిన్ ఒప్పుకున్నాడు. త‌న వ‌ద్ద రూ.2.50 ల‌క్ష‌ల న‌గ‌దు ఉంద‌ని, మిగిలిన రూ.14.50 ల‌క్ష‌ల రూపాయ‌లను సౌద అభిలాష్ వ‌ద్ద ఉంచాన‌ని జెథిన్ పోలీసుల‌కు చెప్పాడు. 26వ తేదీన తెల్ల‌వారు జామున 4 గంట‌ల స‌మ‌యంలో వారిద్ద‌రిని అరెస్ట్ చేసి వారి వ‌ద్ద ఉన్న రూ.17 ల‌క్ష‌ల న‌గ‌దును, రెండు సెల్ ఫోన్లు, ద్విచ‌క్ర వాహ‌నాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను రిమాండ్‌కు త‌ర‌లించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.