సరిహద్దుల నుండి ఫార్మా ఫ్యాక్టరీల దాకా మాదకద్రవ్యాల మాఫియా పై తక్షణమే ఉక్కుపాదం మోపాలి
• ఎన్టీఆర్, చంద్రబాబు స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ప్రజా చైతన్య ఉద్యమం
• సికింద్రాబాద్ పార్లమెంట్ మీడియా సమావేశంలో సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిశోర్ డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 18, ( అద్దం న్యూస్ ) : తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి దందా.. యువత భవిష్యత్తును కాపాడటంలో ప్రభుత్వం విఫలం చెందిందని సికింద్రాబాద్ పార్లమెంట్ మీడియా సమావేశంలో సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిశోర్ లు అన్నారు. సరిహద్దుల నుండి ఫార్మా ఫ్యాక్టరీల దాకా మాదకద్రవ్యాల మాఫియా – తక్షణమే ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. ఎన్టిఆర్, చంద్రబాబు స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ప్రజా చైతన్య ఉద్యమం చేస్తామన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నగర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ… ఇటీవల రాష్ట్ర పోలీస్ క్రైమ్ సమీక్ష, జాతీయ నేర గణాంక సంస్థ ( NCRB ) నివేదికల ప్రకారం, తెలంగాణలో గత మూడేళ్లలో ( 2023–24 నుండి 2025–26 మధ్య ) నార్కోటిక్స్ ( NDPS ) కేసులు 46 నుండి 47 శాతం మేర పెరిగి 2,026 నుండి 2,960 కు చేరాయన్నారు. 2026 ప్రథమార్థంలో కేవలం ఐదున్నర నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 204 మంది విద్యార్థులు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడటం ( సగటున నెలకు దాదాపు 40 మంది విద్యార్థులు ) విద్యావ్యవస్థలో డ్రగ్స్ చొరబాటుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న మొత్తం డ్రగ్స్ వినియోగంలో 50 శాతానికి పైగా ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే జరుగుతోందన్నారు. 25–30 ఏళ్ల యువతలో సుమారు 40 శాతం మంది, 12–18 ఏళ్ల బాలబాలికల్లో 25 శాతం మంది మత్తు పదార్థాల బారిన పడుతుండటం జాతి భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు అని అన్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని కెమికల్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ముసుగులో ( ఇటీవల సంగారెడ్డిలో 225 కిలోల ఎఫెడ్రిన్ పట్టుబడిన ఘటన సహా ), అలాగే కుషాయిగూడ, చర్లపల్లి ప్రాంతాల్లో రహస్యంగా సింథటిక్ డ్రగ్స్ తయారవుతున్నా పర్యవేక్షణ కొరవడిందన్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుండి ఖమ్మం, భద్రాచలం మీదుగా రోడ్డు, విమాన మార్గాల్లో హైదరాబాద్‌కు వందల కోట్ల రూపాయల విలువైన గంజాయి, మెఫెడ్రోన్ సరఫరా అవుతోందని పేర్కొన్నారు. ఎన్డీఏ (NDA) కార్యక్రమంలో భాగంగా ‘ నషా ముక్త్ భారత్ ‘ ( డ్రగ్స్ రహిత భారత్ ) స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ నో డ్రగ్స్ బ్రో ‘ ( No Drugs Bro ) నినాదంతో రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు పూర్తిస్థాయి యాంటీ-డ్రగ్, యాంటీ-గంజా ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు.
అదే స్ఫూర్తితో తెలంగాణ యువతను డ్రగ్స్ మహమ్మారి నుండి రక్షించేందుకు తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగుతోందన్నారు. పత్తర్‌గట్టిలో కేరళ నుండి చదువుకోవడానికి వచ్చిన నర్సింగ్ విద్యార్థినిని గంజాయి మత్తులో ఉన్న దుండగుడు కిటికీ ఊసలు విరగ్గొట్టి అత్యంత కిరాతకంగా బలిగొనడం జరిగిందన్నారు. తాజాగా ఒక విదేశీ ( థాయ్‌లాండ్ ) యూట్యూబర్ పట్ల మత్తులో అసభ్యంగా ప్రవర్తించడం రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు అద్దం పడుతున్నాయన్నారు. దీపావళి రోజున నా ఇంటి ముందే ఒక చిన్నారి ముగ్గు వేస్తుంటే మత్తులో ఉన్న నలుగురు యువకులు వేధించడంతో, నేను స్వయంగా 45 నిమిషాల పాటు కాపలాగా ఉండాల్సి వచ్చిందని.. మహిళలకు ఉచిత పథకాల కంటే ముందు ప్రాణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిశోర్ మాట్లాడుతూ… డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన నిందితులకు బెయిల్ రాకుండా ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ద్వారా కఠిన శిక్షలు విధించాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి అరెస్టులు, ఛార్జ్షీట్లు, శిక్షల వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 8వ తరగతి నుండే పాఠశాలల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రత్యేక పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాలన్నారు. పబ్బులు, ఫామ్‌హౌస్‌లు, విద్యాసంస్థల వద్ద నిరంతర నిఘా పెట్టాలన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో ” నో డ్రగ్స్ బ్రో ” ప్రజా ఉద్యమం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆదేశాల మేరకు, ఎన్నికలతో సంబంధం లేకుండా సమాజ పునర్నిర్మాణం కోసం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలల వద్ద కరపత్రాల పంపిణీ, వీధి నాటకాలు, యువతతో భారీ బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం లేదా ఏ రాజకీయ పార్టీ అయినా చిత్తశుద్ధితో ముందుకు వస్తే వారికి పూర్తి సహకారం అందించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక విభాగాల పేరుతో హడావుడి చేసి కేసులు నీరుగార్చితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘ ఈగల్ ‘ ( EAGLE ) వ్యవస్థను తెచ్చామంటూ కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమవుతోందని విమర్శించారు. 2025–26లో వందల కోట్ల డ్రగ్స్ పట్టుబడ్డాయని చెబుతున్నా, సూత్రధారులకు కఠిన శిక్షలు పడటం లేదన్నారు.
వీధుల్లో ఉండే అనాథ బాలలు వైట్నర్, దగ్గు మందులు, గంజాయికి బానిసలవుతుండగా, ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు ఒత్తిడి పేరుతో పబ్ కల్చర్, రేవ్ పార్టీలకు అలవాటు పడి కుటుంబ విచ్ఛిన్నానికి గురవుతున్నారన్నారు. డ్రగ్స్ మాఫియా వెనుక అంతర్జాతీయ స్మగ్లర్లు, ఉగ్రవాద శక్తుల ముప్పు పొంచి ఉందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బిసి సెల్ మాజీ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పి.అశోక్, మాజీ కార్పొరేటర్ పలుస బాలరాజ్ గౌడ్, నాయకులు తడక వినోద్, కరణం కిరణ్, కట్ట రాములు, శ్యామ్ సుందర్, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.








