Friday, September 18, 2026
No menu items!
HomeEducationఈ నెల 10న విద్యా సంస్థ‌ల బంద్

ఈ నెల 10న విద్యా సంస్థ‌ల బంద్

📰 Generate e-Paper Clip

ఈ నెల 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే
విద్యా సంస్థల బంద్‌కు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు

హైద‌రాబాద్‌, జూలై 8, ( అద్దం న్యూస్ ) :  తెలంగాణ రాష్ట్రంలో విద్య రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌కు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్ఐ ) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, ఈ బంద్ లో యువత పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ లు పిలుపునిచ్చారు. బుధవారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యాసంస్థల బంద్ కు సంబందించిన వాల్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను కుదించే ఆలోచనను వెనక్కి తీసుకోవాలని, పాఠశాలలను విలీనం చేయడం, విద్యార్థుల సంఖ్య పేరుతో పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలు, ఉపాధ్యాయ పోస్టులతో పాటు, విద్యా శాఖలో కీలక పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ప్రభుత్వ విద్య తీవ్ర సంక్షోభంలో పడిందన్నారు.

పాఠశాలలు, ఇంటర్ కళాశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో భవనాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు సౌక‌ర్యాలు లేవ‌న్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు, డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నా ప్రభుత్వం నియంత్రణలో విఫలమైందన్నారు. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని, పెండింగ్ ఫీజు రియంబర్స్‌మెంట్‌, స్కాల‌ర్‌షిప్స్ ల‌ను విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని వామపక్షాల విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10న జరిగే విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, యువజనులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ఎల్.మూర్తి, ఎండీ.జావీద్, నాయకులు దేవేందర్, రాజు రాంటెంకి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page