హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కొత్త మీడియా కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య కోరారు. ఈ మేరకు ఆయన గురువారం అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అసెంబ్లీలో మీడియా కమిటీ మారలేదని, కొత్త కమిటీ వేయకపోవడం, పాత కమిటీ పని చేయకపోవడం వల్ల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చాలా మంది మీడియా ప్రతినిధులకు ఎంట్రీ పాస్ లు లభించడం లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మీడియా కమిటీ చేసిన సిఫారసు మేరకే పాత జాబితా ప్రకారం అసెంబ్లీ ఎంట్రీ పాస్ లు ఇస్తూ ఇతర మీడియాల ప్రతినిధులకు ఇవ్వడం లేదని అన్నారు. గత సంవత్సరం నుండి అసెంబ్లీలో మీడియా కమిటీ లేదని, పాత కమిటీ ఉంది కానీ అది అమలులో లేదని, ఈ ప్రభుత్వంలో ఏ కమిటీ లేదని, దీనివల్ల జర్నలిస్టులు అసెంబ్లీ పాస్‌లు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా చాలా కమిటీలు మారలేదని, గత ప్రభుత్వంలో వేసిన పాత కమిటీలే నేటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ మీడియా కమిటీతో పాటు రాష్ట్ర, జిల్లాస్థాయి మీడియా అక్రెడిటేషన్ కమిటీలు కూడా మారలేదని అన్నారు. జీవోల సమీక్ష పేరుతో కొత్త కమిటీలు వేయకుండా, కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల వార్తలను కవరేజి చేయడానికి అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అసెంబ్లీ పాస్‌లు మంజూరు చేయాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, దీని వల్ల జర్నలిస్టులు ఇబ్బందులు పడడమే కాకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అసెంబ్లీ సమావేశాలు రెండు సార్లు జరిగాయని, ప్రస్తుతం మూడోసారి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని,ఇప్పటికైనా వెంటనే అసెంబ్లీ మీడియా కమిటీ ఏర్పాటు చేయాలని, లేదా అర్హుత ఉన్న అన్ని మీడియా సంస్థల ప్రతినిధులకు అసెంబ్లీ ఎంట్రీ పాస్‌లు మంజూరు చేయాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply