‘ గ్లోబల్ సమిట్ ‘, ‘ ఫ్యూచర్ సిటీ ‘ లు ఆర్భాటాలే
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, డిసెంబర్ 20, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ గ్లోబల్ సమిట్ ‘, ‘ ఫ్యూచర్ సిటీ ‘ వంటి కార్యక్రమాలు వంటి కార్యక్రమాలు కేవలం ప్రచార ఆర్భాటాలే తప్ప ప్రజలకు కలిగే లాభమేమిలేదని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలు, అప్రజాస్వామిక ఎన్నికల తీరుపై ఆయన తీవ్ర ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… గ్లోబల్ సమిట్ పేరుతో సుమారు 300 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేసిందని, ఇది కేవలం అధికార ప్రచార కండూతి మాత్రమేనని పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం, రోడ్డు పక్కన తెలంగాణ తల్లి విగ్రహం పడిపోయి, డేరాలు ఎగిరిపోయి పడి ఉన్నా పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, ఇది తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనకు లక్షల్లో ఖర్చు చేసారని.. కేవలం 10 నిమిషాల ఢిల్లీ పర్యటనకు ప్రత్యేక విమానం కోసం రూ. 90 లక్షలు ఖర్చు చేయడం, ఢిల్లీ పర్యటనల పేరుతో ఇప్పటికే లక్షల్లో దుబారా చేయడం చూస్తే, తన సౌకర్యాల కోసం కోట్లల్లో ఖర్చు చేస్తూ, ప్రజలకు మాత్రం ఖజానా ఖాళీ అని మాయమాటలు చెప్పడం ముఖ్యమంత్రికి తగదని మండిపడ్డారు.
ప్రభుత్వం తమ జల్సాలలో మునిగి తేలుతూ, రాష్ట్ర ప్రజల కీలక సమస్యలను గాలికి వదిలేసిందని.. విద్యా వ్యవస్థను అంధకారంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందన్నారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతున్నారని, నిధులు ఆపేస్తామని బెదిరించి పంచాయతీలను భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకున్నట్లు వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని సాయిబాబా అన్నారు. వాపును చూసి బలమని భ్రమ పడవద్దని, అక్రమ గెలుపులతో విర్రవీగుతున్న ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని ‘ ముందుంది ముసళ్ల పండగ ‘ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, సొన్నాకుల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply