ఓడిపోతామనే భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రభుత్వ ప్రయత్నం
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా

హైదరాబాద్, అక్టోబర్ 10, అద్దం న్యూస్ : ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా ప్రజా వంచనకు పాల్పడుతూ సంవత్సరన్నర కాలంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల కారణంగా ప్రజలకు మొహం చూపించలేక, స్థానిక సంస్థల ఎన్నికలు గడువు లోపల జరిగితే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనక తప్పదని, ఓడిపోతే భంగపాటు తప్పదనే భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నాలు ముమ్మరం చేసిందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… గతంలో నిర్వహించిన బీసీ కులగణన సర్వేను తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఆ సర్వేలో 56 శాతం బీసీలు ఉన్నట్టు నివేదిక తెలిస్తే, బిసిలు 52 శాతంగా ఉన్నారని ప్రకటించారన్నారు. అసలు ఎన్నికలకు ముందు ఏ నివేదిక ఆధారంగా, ఏ సర్వేను ప్రామాణికంగా తీసుకుని 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఎలా ఇచ్చారని సాయిబాబా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహించింది పెద్ద బూటకమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేక కేవలం కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఇవన్నీ ఎన్నికలును వాయిదా వేయడానికి చేస్తున్న కుట్రలేనని అన్నారు. వందేళ్ల పార్టీ అని చెప్పుకునే గర్వంగా చెప్పుకుని కాంగ్రెస్ నాయకులు, ఈ 100 ఏళ్ళుగా బీసీలకు ఏం చేశారని సాయిబాబా నిలదీశారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందాలనే దృష్టితో బీసీల నామజపం చేస్తుందన్నారు. వంద సంవత్సరాల పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ ఇంత కాలం బీసీలకు రిజర్వేషన్ ఎందుకు కల్పించలేక పోయిందని ప్రశ్నించారు. నిజంగా వీరికి బిసిలపై చిత్తశుద్ధి ఉంటే ఇండియా కూటమిలోని అన్ని పార్టీలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సాధించాలన్నారు.
ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఇద్దరూ స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందడానికే చేస్తున్న ప్రయత్నమేనని సాయిబాబా అన్నారు. నిన్నటి కోర్టు తీర్పు అందుకు నిదర్శనమని అన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ చేస్తున్న నాటకాలేనని, ఈ కుట్రలను అర్థం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బిసి రిజర్వేషన్లపై కేవలం చేతులతో దులుపుకునే ప్రయత్నం చేయకుండా, ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలతో కలిసి అఖిలపక్షంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ సాధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నాయకులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్, తడక వినోద్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply