ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థులే బలి
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, డిసెంబర్ 16, అద్దం న్యూస్ : ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థులే బలి అవుతున్నారని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రభుత్వ పాఠశాలల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై తెలుగు దేశం పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ అని అన్నారు. మంగళవారం హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మాదాపూర్‌లోని చంద్రానాయక్ తండా పాఠశాలలో ఈ నెల 12వ తేదీన ఉదయం బోండా ( టిఫిన్‌గా ), మధ్యాహ్నం సేమియా పాయసం, బంగాళదుంప కూర భోజనం తిన్న గంటలోపే ఏకంగా 44 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని నానక్‌రాంగూడ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. అలాగే అదే రోజు బాగ్‌లింగంపల్లిలోని ప్రభుత్వ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో ఉదయం ఉప్మా తిన్న 22 మంది విద్యార్థినులు కూడా వాంతులు, విరేచనాలకు లోనయ్యారని… వీరిలో 16 మందిని కింగ్‌కోఠి ఆస్పత్రికి, ఆరుగురిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారన్ఆరు. ఈ రెండు ఘటనలు రాష్ట్రంలో గురుకుల పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వానికి ఏ మాత్రం శ్రద్ధ లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
గురుకుల పాఠశాలలు, గురుకుల విద్యాలయాలపై ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేదని, వాటిని ఎత్తేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందనే అనుమానం కలుగుతోందన్నారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయన్నారు. కలుషిత ఆహారం తిని పిల్లలు ఆసుపత్రి పాలైతే, వారిని పరామర్శించడానికి అధికార పక్షానికి చెందిన ఒక్క నాయకుడు కూడా పోకపోవడం దారుణమన్నారు. ఇటలీ ఫుట్‌బాల్ ప్లేయర్ అగస్త్య రాకను పెద్ద ఆడంబరంగా చేసుకొని, తమ వ్యక్తిగత అవసరాలు, విలాసాలు తీర్చుకోవడంపై ఉన్న శ్రద్ధ, ఆసుపత్రి పాలైన పేద విద్యార్థులపై లేకపోవడం ప్రభుత్వ దుర్మార్గమైన చర్య అని అన్నారు. మైనారిటీ హక్కులకు తామే బాధ్యులం అని చెప్పే మజ్లిస్ పార్టీ నాయకులు కూడా నోరు విప్పి మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. పేద ప్రజల పక్షాన ఉన్నామని చెప్పుకునే సీపీఐ పార్టీ కూడా స్పందించకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. కేవలం సంవత్సర కాలంలోనే 6.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కారని విమర్శించారు. అప్పులు చేసి, విలాసాల కోసం ఖర్చు పెడుతూ ఢిల్లీ అధిష్టానానికి కప్పం కడుతున్నారని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను వెంటనే ప్రభుత్వ ప్రతినిధులు, అధికార పక్ష నాయకులు పరామర్శించి, ఆ కలుషిత ఆహార ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో గురుకుల పాఠశాలల్లో ఇటువంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ప్రజా సంక్షేమానికి, విద్యార్థుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సాయిబాబా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, తడక వినోద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()














Leave a Reply