నీటి ఎద్ద‌డిని ప్ర‌భుత్వం నివారించాలి  – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

నీటి ఎద్ద‌డిని ప్ర‌భుత్వం నివారించాలి 

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

హైదరాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ :  వేసవికాలం ప్రారంభం కాగానే నగర శివారు ప్రాంతాలలో తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొవడం జరుగుతోంద‌ని, ప్రభుత్వం ఈ నీటి ఎద్దడిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. శ‌నివారం న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోతే రేపు రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారి పోతుందని అన్నారు. గతంలో కర్ణాటక రాష్ట్రంలో మాదిరిగా తాగడానికి నీళ్లు దొరకక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అదే విధంగా నీటి ఎద్దడి నివారించడానికి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంకులను అధికార పార్టీ నాయకులకు, అనుచరులకు కేటాయిస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నార‌న్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కో ట్యాంకరుకు రూ.500 లు నుండి 5 వేల వరకు వసూలు చేస్తూ ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారని విమ‌ర్శించారు. అసలే పరిస్థితి కరువు తలపిస్తుంటే “గోటి చుట్టుపై రోకలి పోటు” అన్న చందంగా అప్రకటిత విధ్యుత్ కోతల వల్ల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. కాబట్టి ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. భూగర్భ జలాలు ఆందోళన స్థాయిలో అడుగంటి పోతున్నాయన్నారు. కర్ణాటక రాష్ట్రంలో భూగర్భ జలాలను పరిరక్షించడానికి శాస్త్రీయమైన పరిశోధనలో చేపట్టిన విధంగా ప్రభుత్వం మన రాష్ట్రంలో కూడా చేపట్టాలని అన్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎంతసేపు ఆరు వాగ్దానాలు అంటూ ప్రజాపాలన అంటూ అమలుకాని హామీలతో కాలయాపన చేయకుండా తాగునీటి సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. జలాశయాల్లో గత సంవత్సరం కంటే నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ప్రాజెక్టులన్ని డెడ్ స్టోరేజ్ నీటి మట్టానికి పడిపోయాయ‌న్నారు.

రానున్న రోజుల్లా వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయని, కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. శ్రీశైలం నుంచి మంచినీటి అవసరాల కోసం వాడుకోవాలని అన్నారు. నాగర్జున‌సాగ‌ర్ నీటిమట్టం తగ్గిపోయిందని, హైదరాబాదుకు నాగార్జున నుంచి ప్రతిరోజు రావాల్సిన సరఫరా కూడా తగ్గిపోయింద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాలలో నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయ‌న్నారు. భూగర్భ జలాల పాతాళంలోకి పడిపోతున్నాయ‌ని, ఇప్పుడే ఇలావుంటే రానున్న రోజుల్లో ఇంకెన్ని ఇబ్బందులు తలెత్తుతాయో ప్రభుత్వం వాస్తవాలు గ్రహించి, తగిన చర్యలు చేపట్టాలని సాయిబాబా డిమాండ్ చేసారు. ప్రభుత్వం స్పందించకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తే పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్ కుమార్, శ్యామ్ సుందర్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page