ఆమరణ దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్‌కు ఏమైనా జరిగితే
కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబ
హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ఆమరణ దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్‌కు ఏమైనా జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిదేనని, కాంగ్రెస్ నాయకులదే బాధ్యత అని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబ అన్నారు. సోమవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్‌లతో కలిసి సాయిబాబా మాట్లాడుతూ.. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, కాంగ్రెస్ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచర మంత్రివర్గం, టొపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తదితర నాయకులందరూ కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామంటూ, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారన్నారు. సందర్భంగా బీసీ నాయకులను కొంతమందిని వెంట తీసుకువెళ్లారని.. వారిలో “జాతీయ హిందూ బీసీ సంఘం” అధ్యక్షుడు సిద్దేశ్వర్ ఉన్నారని తెలిపారు. బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ సిద్దేశ్వర్ ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్షకు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఆమరణ నిరాహార దీక్షకు చేపడుతున్న సిద్దేశ్వర్‌ను ఇప్పటి వరకు కనీసం పరామర్శించి పట్టించుకున్న నాథుడే లేడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కనీసం కాంగ్రెస్ నాయకులు గాని పట్టించుకోవడంలేదన్నారు. కేవలం ప్రచారం కోసం చేపట్టిన ధర్నాలో ఒక అమాయకుడు బలయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ సిద్దేశ్వర్‌కు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని సాయిబాబ ప్రశ్నించారు. గత వారం రోజులకు పైగా నిరాహర దీక్ష చేస్తున్న అతనిని నేటికి కాంగ్రెస్ నాయకులు పరామర్శించక పోవడం విచారకరం.. దారుణమన్నారు. ఒక బీసీ నాయకున్ని బలిపశువు చేయాలని ప్రయత్నించడం దురదృష్టకరమని సాయిబాబా ధ్వజమెత్తారు.
వెంటనే కాంగ్రెస్ నాయకులు సిద్దేశ్వర్‌తో మాట్లాడి ఆయనను దీక్ష విరమించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులదే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు “చెవిటి వాడి ముందు శంఖం వూదిన” చందంగా ఉందన్నారు. ప్రభుత్వానికి కూడా కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. వెంటనే స్పందించి ఆమరణ నిరాహార దీక్షను కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి విరమింపజేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాసుల సుదర్శన్ రెడ్డి, నాగు నగేష్, కిరణ్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply