...

పక్కనోళ్ళ నీటినీ మీరే వాడేస్తే.. వాళ్ళ పరిస్థితి ఏంటి..! మోటార్లను వాడుతున్న వారిపై ఎండీ అశోక్‌రెడ్డి ఆగ్రహం

 

పక్కనోళ్ళ నీటినీ మీరే వాడేస్తే.. వాళ్ళ పరిస్థితి ఏంటి..!

♦ మోటార్లను వాడుతున్న వారిపై ఎండీ అశోక్‌రెడ్డి ఆగ్రహం
♦ రెండో రోజు కొనసాగిన మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్
♦ ఎస్సార్ నగర్ లోని మధురా నగర్లో పర్యటించిన ఎండీ అశోక్‌రెడ్డి
♦ పలు హాస్టల్ లు, నివాసాల నుంచి మోటార్లు సీజ్ చేసిన అధికారులు
♦ వ్యవసాయానికి వాడే మోటర్లతో నీటిని తోడుతున్న వైనం
♦ మళ్ళీ తప్పు చేస్తే నల్లా కనెక్షన్ తొలగించాలని అధికారులకు ఆదేశించిన ఎండీ
♦ ఈ రోజు 32 ఇల్లీగల్ మోటార్లు స్వాధీనం.. 38 మందికి పెనాల్టీ విధింపు
♦ ఈ డ్రైవ్ తో ప్రెజర్ పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న లో లైన్ వినియోగదారులు 

హైదరాబాద్, అద్దం న్యూస్ :   జలమండలి సరఫరా చేసే నీటిని అక్రమంగా మోటార్లతో తోడుతున్న వారిపై జలమండలి చేపట్టిన డ్రైవ్ పై ఎండీ అశోక్‌రెడ్డి దృష్టి సారించారు. మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ ప్రారంభించిన రెండో రోజూ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ 6, ఎస్ ఆర్ నగర్ లోని మధురానగర్ పరిసర ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. బుధ‌వారం న‌గ‌రంలోని ఎస్ఆర్ నగర్, మధురానగర్‌ల‌ల్లో ముఖ్యంగా హాస్టళ్లు, వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతంలో లో-ప్రెషర్ తలెత్తుతున్న ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. కొందమంది వినియోగదారుల ఇండ్లలో అక్రమంగా మోటార్లు వినియోగిస్తూ పట్టబడగా వారి మోటార్లను సీజ్ చేసి పెనాల్టీ విధించారు. ఈ నేపథ్యంలో ఎండీ అశోక్‌రెడ్డి ఓ హాస్టల్ ప్రాంగణంలోకి వెళ్ళగా.. ఆ యజమాని తన నల్లాకు వ్యవసానికి వినియోగించే 2 హెచ్ పి మోటర్‌తో నీటిని తోడడంతో యజమానిపై ఆగ్రహం వెలిబుచ్చారు. పది ఇళ్లకు సరిపడా నీటిని నువ్వు ఒక్కడే వాడితే మిగతా వాళ్ళకి ఏమైపోవాలి ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి తప్పు చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ఆ హాస్టల్‌కు నెల వరకు నీటిని నిలిపివేసి, ట్యాంకర్ సైతం బుక్ చెయ్యకుండా బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇదే ప్రాంతంలో మరో భవనానికి సైతం వ్యవసాయ మోటార్ వాడుతూ పట్టుపడగా కనెక్షన్ తొలగించి, నెలవరకు ట్యాంకర్ కూడా సరఫరా నిలిపివేయమని ఎండీ అశోక్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డ్రైవ్ ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో వారం పాటు ప్రతి రోజూ వాటర్ సప్లై సమయంలో తనిఖీ చేసి మోటార్లు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ డ్రైవ్ మరో 60 రోజుల వరకు నగరం అంతా కొనసాగుతుందని మోటార్లు బిగించి పట్టుబడితే మోటార్లు సీజ్ చేస్తారని, రెండోసారి కొనసాగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తారు. కాబట్టి వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించవద్దని ఈ సందర్బంగా ఎండీ అశోక్‌రెడ్డి హెచ్చరించారు. మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ లో రెండో రోజు ఇప్పటి వరకు అన్ని డివిజన్లలో కలిపి మొత్తం 134 ఇల్లీగల్ మోటర్లను గుర్తించి 32 సీజ్ చేయగా మరో 38 మంది వినియోగదారులకు అక్రమంగా మోటార్లు ఉపయోగించినందుకు.. నీటి వృధా చేసినందుకు పెనాల్టీ విధించారు. అత్యధికంగా ఓ అండ్ ఎమ్ డివిజన్ లో 6 ఎస్ఆర్ నగర్ పరిధిలో 20 మోటార్లు సీజ్ చేసి పెనాల్టీ వేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి సివిఓ గ్యానేందర్ రెడ్డి, సిఐ లక్మారెడ్డి, జీఎం హరి శంకర్, డీజీఎంలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మోటార్లను వాడుతున్న వారిపై ఎండీ అశోక్‌రెడ్డి ఆగ్రహం

జలమండలి విజ్ఞప్తి :

జలమండలి వినియోగదారులు ఎవరైనా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తారు. రెండోసారి మోటార్ తో నీటిని తోడితే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తారు. కాబట్టి వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించవద్దని ఆలా చేయడంతో మిగితా వినియోగదారులకు లో ప్రెషర్ తో నీటి సరఫరా కావడంతో ఇబ్బంది పడతారు. అలాగే నీటి సరఫరా అవరాలకు సరిపోక ట్యాంకర్ బుక్ చేస్తున్నారని.. దీంతో ట్యాంకర్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మోటార్లు బిగించవద్దని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది. ఒక వేళ తక్కువ ప్రెజర్ తో నీరు సరఫరా అయినా.. లేదా నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా.. తమకు దగ్గర్లోని సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలి. లేదా జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వాటిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుని సమస్యల్ని పరిష్కరిస్తారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.