రాబోయే కాలంలో.. బీసీలలో ఐక్యత పెరగాలి – నిరాహార దీక్ష‌లో వ‌క్త‌లు

రాబోయే కాలంలో.. బీసీలలో ఐక్యత పెరగాలి
బిసిల‌కు బ‌డ్జెట్‌లో న్యాయం చేయ‌క‌పోతే మ‌రో ఉద్య‌మ‌మే
» నిరాహార దీక్ష‌లో వ‌క్త‌లు

హైదరాబాద్, ఫిబ్రవరి 27, అర్థం న్యూస్ :   రాబోయే కాలంలో.. బీసీలలో ఐక్యత పెరగాల‌ని, జాతిని కదిలించి అంద‌రిని కలుపుకొని సమాజాన్ని నడిపించాలని బిసి ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రెంట్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన నిరాహార దీక్ష‌లో పాల్గొన్న వ‌క్త‌లు పేర్కొన్నారు. బడ్జెట్‌లో బీసీలకు జరిగే అన్యాయంపై ఇక సహించమని, బిసిల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ బిసి ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్‌ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరాహార దీక్ష జరిగింది. ఈ నిరాహార దీక్షకు మద్దతుగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, ప్రొఫెసర్ మురళి మనోహర్, మాజీ డిజిపి పూర్ణచందర్ రావు లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎంపి ఈటల రాజేందర్ మాట్లాడుతూ… బీసీ ఉద్యమాలు, చేస్తున్న సామాజిక చైతన్యం ఒకణ్ణి గద్దె దింపి ఇంకొకణ్ణి ఎక్కించడానికి పనికి వస్తున్నాయి తప్ప మన ఆశయం నెరవేరడం లేదన్నారు. ఇంత జనాభా ఉన్న బీసీలు ఒకనికి దరఖాస్తు ఇచ్చుడు ఎందుకు ? బుచ్చగాళ్ల లెక్క అడుక్కోవడం ఎందుకు ? నీ రాజ్యం నువ్వు ఏలుకో అనే నినాదం వచ్చిందని తెలిపారు. కేంద్రంలో కూడా ఒక బీసీ మంత్రిత్వ శాఖ రావాలన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలన్నారు. ఆరు గ్యారెంటీలు 420 పనులు ఏవీ అమలు కావడం లేదని విమ‌ర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే సంవత్సరానికి లక్ష కోట్లు అదనంగా కావాలి ఎలా ఇస్తావు అని రేవంత్ రెడ్డిని అడిగితే.. ఈటల రాజేందర్ కే తెలివి ఉందా ఒక తునక అమ్మితే కోట్ల రూపాయలు వస్తాయి అన్నాడు.. మరి ఏమైంది రేవంత్ రెడ్డి అని ప్ర‌శ్నించారు. తునక అమ్మితే సంక్షేమ పథకాలు అన్నీ అమలవుతాయి అన్నావు కదా రేవంత్ రెడ్డి.. మరి ఆ తునకలు ఎందుకు కాపాడడం లేదన్నారు. ఎల్లమ్మబండలో 300 ఎకరాల్లో 150 ఎకరాలు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలకు పంచాడని… అదే సర్వే నంబర్‌లో ఉన్న అదే ప్రభుత్వ భూమి 150 ఎకరాలు ఎలా ప్రైవేట్ భూమి అవుతుందని ప్ర‌శ్నించారు. ఖమ్మంలో పేదల ఇల్లు కూలగొట్టారని… ఒక తరం కష్టపడి కట్టుకున్న ఇళ్లపై బోల్డోజర్ నడిపారన్నారు. శత్రు దేశాల మీద యుద్ధం చేసినట్టు పేద ప్రజలమీద దాడి చేస్తున్నారని… దీన్ని అడ్డుకునే శక్తి ప్రజలకు మాత్రమే ఉందన్నారు. ఈ కాలంలో కుమ్మెరలో జరిగిన సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకొనేలా చేస్తున్నాయని, ఇలాంటివి ప్రజాస్వామ్యానికే దురదృష్టకరమ‌ని అన్నారు. బీసీల ఉద్యమానికి నా పూర్తి సంఘీభావం అని ఈట‌ల స్ప‌ష్టం చేశారు.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… మోసపోయి వారి చేతిలో అధికారం పెట్టి ఈ రోజు అడుక్కునే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. శాంతియుతంగా ధ‌ర్నాలు చేయ‌డానికి కూడా అనేక ఆంక్ష‌లు విధిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ వ‌స్తే మ‌న‌కు రాజ్యాంగ‌ప‌రంగా అన్ని హ‌క్కులు, వాటాలు వ‌స్తాయ‌ని విద్యార్థులు, మేధావులు, సంఘాల నాయ‌కులు, ప్ర‌జ‌లు కొట్లాడార‌న్నారు. బిసి గురుకులాల్లో విద్యార్థులు చ‌నిపోతున్నార‌ని, కొత్త‌గా ఉద్యోగాలు లేవు… రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల‌కు ఇవ్వ‌డానికి డ‌బ్బులు లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని విమ‌ర్శించారు. బ‌డ్జెట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించే స‌మ‌యంలో బిసి సంఘాల నాయ‌కుల‌ను, మేధావుల‌ను పిలిచి మీకు ఏమి కావాల‌ని అడిగి తెలుసుకోవాల‌న్నారు. ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద వ‌రుస‌గా ధ‌ర్నాలు చేప‌డితే కేంద్రంలో క‌ద‌లిక వ‌స్తుంద‌న్నారు.

ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, మధుసూదనాచారి లు మాట్లాడుతూ… కామారెడ్డి డిక్ల‌రేష‌న్‌లో ఇచ్చిన హామీల‌ను ఒక్క హామీని నెర‌వేర‌దని, ఆచ‌ర‌ణ కాద‌ని కాంగ్రెస్ నాయకుల‌కే న‌మ్మ‌కంలేద‌న్నారు. తెలంగాణ‌లో 2 కోట్ల పైచీలుకు బీసీలున్నార‌ని, కానీ నిరాహార దీక్ష‌కు చాలా త‌క్కువ సంఖ్య‌లో హాజ‌ర‌య్యార‌న్నారు. కానీ బిసిల్లో చైత‌న్యం తీసుకురావాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. బిసిలంద‌రూ ఒక‌టే అని చాటిన‌ప్పుడే పీఠం క‌దిలిపోతుంద‌న్నారు.

ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ ఫ్రంట్‌ వైస్ చైర్మన్ ఎస్.దుర్గయ్య గౌడ్, రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, ఎలిశెట్టి విజయకుమార్ గౌడ్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాయకులు ఎర్ర మ‌ధు, వెంకన్న నేత, బైరి శేఖర్, అంబాల నారాయణ గౌడ్, దాసోజు లలిత, కీర్తి లాల్ గౌడ్, లింగేష్ యాదవ్, పొన్నం దేవరాజు, రమణ, సిపిఎం నాయకులు అబ్బాస్, ఎర్ర సత్యనారాయణ, గడ్డమీది విజయకుమార్ గౌడ్, రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page