కేసీఆర్ కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే… మరో కన్ను జాగృతి – జాగృతి కార్యాల‌యం ప్రారంభోత్స‌వంలో ఎమ్మెల్సి క‌విత‌

కేసీఆర్ కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే… మరో కన్ను జాగృతి  

కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ జూన్ 4న దీక్ష

– జాగృతి కార్యాల‌యం ప్రారంభోత్స‌వంలో ఎమ్మెల్సి క‌విత‌

                          జాగృతి కార్యాల‌యాన్ని ప్రారంభిస్తున్న అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సి క‌విత‌

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :   కేసీఆర్ కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే… మరో కన్ను జాగృతి అని తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సి క‌విత అన్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ జూన్ 4న దీక్ష చేయ‌నున్న‌ట్లు క‌విత ప్ర‌క‌టించారు. శ‌నివారం హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి కార్యాల‌యాన్ని క‌విత‌ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ సోయితో కేసీఆర్ పరిపాలన చేశారని, సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మ అని అన్నారు. కనీసం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులర్పించాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనని వారికి, అమరవీరులకు నివాళులులర్పించని వారికి సీఎం కుర్చిలో కూర్చొనే అర్హత లేదన్నారు. తెలంగాణ గ్రహచారం బాగలేక తెలంగాణకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని.. రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలన్నారు. తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం అని క‌విత ప్ర‌శ్నించారు. తెలంగాణ అమరులు శ్రీకాంత చారి, లేదా యాది రెడ్డి లేదా కాళోజి లేదా పీవీ నరసింహా రావు పేరు పెట్టాల‌న్నారు. తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లడని పరిస్థితి ఏర్పడిందని విమ‌ర్శించారు. చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి నీళ్లు తరలించాలనుకుంటున్నా సీఎం కనీసం స్పంచించడంలేద‌న్నారు. ఎందుకు సీఎం అంత బలహీనంగా ఉన్నారన్నారు.

పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఎందుకు పనిచేస్తున్నారు సీఎం ? అని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నదుల అనుసంధానాన్ని తొపాకులగూడెం నుంచి చేపట్టాలని ప్రతిపాదించారని… కానీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇచ్ఛంపల్లి నుంచి చేపడుతామని చెప్పిందన్నారు. పోలవరం నుంచి 200 టీఎంసీలను గోదావరి నీళ్లను తరలించే ప్రయత్నం జరుగుతోందన్నారు. గోదావరి నీళ్లను తెలంగాణకు శాశ్వతంగా దూరం కానున్నాయన్నారు. దీని పై జూన్ 2 నాడు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. 200 టీఎంసీల హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని.. ప్రతీ ఏడాది 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా ? అని ప్ర‌శ్నించారు. కోటి ఎకరాల మాగాణం చేసిందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా ? అని అన్నారు. రైతులను రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు నోటీసులు ఇచ్చారా ? అని క‌విత ప్ర‌శ్నించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారా ? అది కాళేశ్వరం కమిషనా లేదా కాంగ్రెస్ కమిషనా ? ఇవాళ ప్రతీ తెలంగాణ బిడ్డ బాధపడుతున్నారన్నారు. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇవ్వడమంటే … యావత్తు తెలంగాణకే నోటీసులు ఇచ్చినట్లు అని అన్నారు. కేసీఆర్ పిడికిలికెత్తి బయటికి వస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ వాళ్లు అధికారంలో ఉన్నారని… ఆ విషయాన్ని మరిచిపోయి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం దారుణం అని అన్నారు. నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా చేపట్టబోతున్నామ‌న్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేలాది మందితో మహా ధర్నా చేపడుతామ‌ని, తెలంగాణ జాగృతి బీసీ బిల్లు కోసం గత ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నదన్నారు. ఇటీవల ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన సమయంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడారు కానీ బీసీ బిల్లు మీద మాట్లాడలేదని అన్నారు. బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీకి సెగ తాకే విధంగా పోరాటం చేస్తామని బీజేపీని హెచ్చిరించారు. రైల్ రోకో వంటి కార్యక్రమాన్ని చేడుతామ‌ని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు జాగృతి పోరాటం చేస్తుంద‌న్నారు. మహిళలకు రూ 2500, ఆడపిల్లలకు స్కూటీలు సాధించే వరకు పోరాటం చేస్తామ‌న్నారు. మైనారిటీ హక్కుల కోసం కూడా జాగృతి పోరాటం చేస్తామ‌ని, జాగృతిలో మైనారిటీ హక్కల కోసం ముస్లీం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలను ఏర్పాటు చేస్తామ‌ని క‌విత తెలిపారు. జాగృతి తరఫున ఎస్సీ, ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ వర్గాల కోసం ఉద్యమిస్తామ‌ని పేర్కొన్నారు. మేం పోరాటం చేస్తుంటే ఓర్వలేని కొంత మంది చాలా మాటలు మాట్లాడుతున్నారని… కేసీఆర్ పై ఈగ వాలినా ఊరుకోబోమని క‌విత హెచ్చ‌రించారు. తెలంగాణ కోసం బీజేపీ నాయకులు మాట్లాడకపోవడం దారుణం అని విమ‌ర్శించారు. 8 మంది ఎంపీలను గెలిపించినా కేంద్రం నుంచి ఒక్క రూపాయిని తీసుకురాలేదని ధ్వ‌జ‌మెత్తారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను కాపాడకపోతే తెలంగాణ జాగృతి పవర్ ను చూపిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ వాదాన్ని నిలబెట్టింది జాగృతి అని… జాగృతి సంస్థను ప్రారంభించి దాదాపు 18 సంవత్సరాలు కావస్తుంద‌న్నారు. తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏ అంశంపై అయినా బలంగా గొంతెత్తిందని తెలిపారు. తెలంగాణ జాగృతి కేసీఆర్, జయశంకర్ సార్ స్పూర్తితో జాగృతి సంస్థ పుట్టిందన్నారు. తెలంగాణ సాంస్కృతిక అంశాలపై పనిచేయాలని జయశంకర్ సార్ దిశానిర్దేశం చేశారని క‌విత తెలిపారు. గతంలో అశోక్‌న‌గ‌ర్ కార్యాలయం ఉండేది… ఇప్పుడు బంజారా హిల్స్ కు మార్చామని తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరగానే కేసీఆర్ చేశారని తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page