హైదరాబాద్, సెప్టెంబర్ 25, ( అద్దం న్యూస్ ) : హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. ఖైరతాబాద్‌లోని గణేష్ మండపం నుంచి బయల్దేరిన భారీ గణనాథుడు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రెయిన్ నెంబర్ 4 వద్దకు చేరుకోగా.. అక్కడే నిమజ్జనం పూర్తయింది. ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే సమయంలో ఆ ప్రాంతం మొత్తం బై బై గణేశా నినాదాలతో మార్మోగింది. ఈ సారి 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆ బడా గణేష్.. ఇక సెప్టెంబర్ 14న నుంచి సుమారు 11 రోజుల పాటు పూజలు అందుకున్న ఆ గణనాథుడు శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మండపం నుంచి ఊరేగింపుగా గంగంమ్మ ఒడికి బయల్దేరాడు. దాదాపు 4-5 గంటల పాటు శోభాయాత్ర సాగింది. హుస్సేన్ సాగర్ ( క్రేన్ నెం.4 ) వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాంగ్ బూమ్ క్రేన్ ద్వారా నిమజ్జనం పూర్తైయింది. బడా గణేష్ నిమజ్జనం తిలకించేందుకు హుస్సేన్ సాగర్‌కు భారీగా తరలివచ్చారు భక్తులు. దీంతో హుస్సెన్ సాగర్ పరిసర ప్రాంతాలు మొత్తం భక్తులతో కిక్కిరిపోయాయి. ఎన్టీఆర్ మార్గ్ మొత్తం డప్పు చప్పుళ్లు.. తీన్మార్ డాన్సర్లతో మార్మోగింది.
కొనసాగుతున్న గణేష్ విగ్రహాల నిమజ్జనం :
హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాల ఊరేగింపు కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైన నిమజ్జనం ప్రక్రియ శనివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. అప్పటికి పూర్తి కాకపోతే ఆ సమయాన్ని మరింత పెంచేందుకు సిద్దమని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.

