తెలంగాణలో భూ కబ్జాల పర్వం
మంత్రి కుమారుడి అరాచకం
మంత్రి రాజీనామా చేయాలి
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 12, అద్దం న్యూస్ : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పాలన అంటేనే భూదందా, అధికార దుర్వినియోగం అన్నట్టుగా మారిపోయిందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి.సాయిబాబా తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రుల వరకు అందరూ ప్రజా సమస్యలను గాలికొదిలేసి, వేలకోట్ల రూపాయల ప్రభుత్వ, ప్రైవేటు భూములపై కన్నేసి, దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తాజాగా, రాష్ట్ర రెవెన్యూ మంత్రి కుమారుడికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ చేసిన అరాచకం చూస్తే, తెలంగాణలో ‘చట్టం’ ఉందా ? ప్రజాస్వామ్యపాలన’ ఉందా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని సాయిబాబా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… మంత్రి బెదిరింపులు, అధికార దుర్వినియోగం రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం పరిధిలోని అత్యంత విలువైన వట్టినాగులపల్లి గ్రామ సర్వే నంబర్ 245లోని 20.14 ఎకరాల భూమిని డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కోసం రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ తీవ్రంగా ఒత్తిడి చేసిందన్నారు. ఏకంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రే స్వయంగా రంగంలోకి దిగి, భూమి యజమాని సతీశ్‌షాను పిలిపించుకొని అగ్రిమెంట్ చేయాలని ఒత్తిడి చేశారని విమర్శించారు. మంత్రి బెదిరించినా యజమాని సతీశ్‌షా వినకపోవడంతో, మంత్రి కుమారుడు స్వయంగా పల్లవిషా ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డాడన్నారు. ఈ చర్య ముఖ్యమంత్రికి పాలనపై నియంత్రణ పూర్తిగా కోల్పోయారనడానికి నిదర్శనమన్నారు.
భూమి యజమానులు లొంగక పోవడంతో, మంత్రి కుమారుడు రెవెన్యూ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ, ఏడీ (సర్వే) అధికారిని అడ్డం పెట్టుకుని, అడ్డగోలుగా హద్దులు మార్చి బ్లాక్‌మెయిల్ చేయించారు. ఇది ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి తొత్తుగా మారిందనడానికి నిదర్శనం. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా, మంత్రి కుమారుడు ఏమాత్రం లెక్కచేయకుండా దౌర్జన్యకాండకు పాల్పడడం, చట్టాన్ని పూర్తిగా అపహాస్యం చేయడమే. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే అధికారం ప్రభుత్వ పెద్దలకు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. పేద, మధ్య తరగతి ప్రజలకు రక్షణ కరువైందన్నారు. అధికార పార్టీ నాయకుల కుటుంబాలే ఇలా విలువైన భూములపై కన్నేసి, గుండాగిరి చేస్తుంటే, ఇక సామాన్య పేద, మధ్య తరగతి ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు ఈ ప్రభుత్వంలో రక్షణ ఏముంటుందని పి. సాయిబాబా వాపోయారు.
ఈ ఘటనపై నిజాయితీగా నిర్భయంగా నిలదీసిన పోలీస్ ఆధికారిని ఆగమేఘాల మీద బదిలీ చేసి అతనికి పోస్టింగ్ ఇవ్వకుండా అతన్ని మానసిక ఆవేదనకు గురిచేస్తున్నారన్నారు. ఇది పోలీసుల మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే చర్య. వెంటనే ఆ పోలీస్ అధికారికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో భూదందాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రెవెన్యూ మంత్రి ముఖ్యమంత్రి తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. మంత్రి కుమారుడికి సహకరించిన సర్వేయర్ ఇతర రెవెన్యూ అధికారులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, సస్పెండ్ చేయాలన్నారు. వట్టినాగులపల్లి భూబాధితులకు పూర్తి న్యాయం చేసి, వారి ఆస్తికి రక్షణ కల్పించాలన్నారు. రాష్ట్రంలో మంత్రులు, వారి కుటుంబ సభ్యులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కబ్జాలను నిరోధించడానికి వెంటనే ఈ ప్రభుత్వం వట్టినాగులపల్లి ఘటన కోర్టు సమగ్ర విచారణ జరిపి అసలు నిజ నిజాలు వెలికి తీయాలని, అందుకు ఒక కమిటీని నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()














Leave a Reply