1 కోటి 11 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాల పెంపు
జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
తెలంగాణ బ్యూరో, మే 21, ( అద్దం న్యూస్ ) : తెలంగాణలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త. కార్మికులకు కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. కార్మికుల కనీస వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. కనీస వేతనాలు పెంచిన శుభ సందర్భంగా సీఎం రేవంత్ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కార్మిక ఉపాది శిక్షణ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్మికులకు ఈ శుభవార్తను చెప్పారు. రాష్ట్రంలో కార్మికులను నాలుగు కేటగిరీలుగా విభజించి ఆ ప్రాతిపదికన వేతనాలను పెంచినట్టు తెలిపారు. అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌గా 4 విభాగాలుగా విభజించినట్టు చెప్పారు. ఈ విభాగాల కార్మికులకు గతంలో అర్బన్, రూరల్‌గా 2 జోన్లు ఉండేవని, వాటిని ఇప్పుడు 3 జోన్లుగా విభజించామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని కనీస వేతనాలను నిర్ణయించామని చెప్పారు. జోన్-1లో అన్‌స్కిల్డ్ కార్మికులకు ప్రస్తుత వేతనం రూ.12,750 నుంచి రూ.16 వేలకు, సెమీ స్కిల్డ్ కార్మికులకు ప్రస్తుత వేతనం రూ.13,152 నుంచి రూ.17 వేలకు, స్కిల్డ్ కార్మికులకు రూ.13,772 నుంచి రూ.18,500 లకు, హైలీ స్కిల్డ్ కార్మికులకు రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పెంచిన వేతనాలు వచ్చే జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
కార్మికుల వేతనాల పెంపుపై తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికుల వేతనాల పెంపు జరగలేదని.. తద్వారా రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులు నష్టపోయారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల వేతన సవరణపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి లతో మంత్రివర్గ ఉపసంఘం నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్మిక సంఘాలు, నాయకులు, ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతర స్టేక్‌హోల్డర్స్ అందరితో సంప్రదింపులు జరిపి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత వేతన సవరణపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కార్మికుల సంక్షేమం కోసం మొట్టమొదటిసారి ఈ నిర్ణయం జరిగిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.
ద్రవ్యోల్బణం, నిత్యవసర వస్తువుల పెరుగుదల, ఇంటి అద్దె వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని కార్మికుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఇది కార్మికులకు శుభవార్త అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనేక దేశాల్లో స్కిల్డ్ లేబర్ కొరత ఉందని, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఏజెంట్ల చేతుల్లో కార్మికులెవరూ మోసపోవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా గల్ఫ్, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, అక్కడి కంపెనీలతో సంప్రదింపులు జరిపి వారికి ఏం కావాలో అందుకు అనుగుణంగా ఇక్కడి నుంచి కార్మికులను పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కార్మికులకు అన్ని రకాలుగా రక్షణగా ఉంటుందని, తొందర్లోనే మరిన్ని మంచి ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకొస్తుందని చెప్పారు. గతంలో ప్రమాదవశాత్తు గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉండేది కాదని, ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వారి అండగా నిలవడమే కాకుండా ఆ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.![]()

![]()












Leave a Reply