హైదరాబాద్, అద్దం న్యూస్ : జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మహా నగరానికి జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి పైపు లైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు తమ నల్లాలకు మోటార్ల బిగించుకోవడం జలమండలి అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో జలమండలి విజిలెన్స్ అధికారులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జలమండలి పైపులైనుకు నేరుగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్న వినియోగదారులను గుర్తించి జలమండలి విజిలెన్స్ సిబ్బంది మోటార్లు సీజ్ చేసారు. శుక్రవారం రోజున ఓ అండ్ ఎం డివిజన్ నంబర్-2, మూసారాంబాగ్ సెక్షన్ పరిధిలోని శాలివాహన నగర్ రోడ్ నంబర్ 12, 13, 14 ప్రాంతాల్లో పర్యటించి పైపులైనుకు అక్రమంగా బిగించిన 8 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తారు. రెండోసారి మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు తెలిపారు. వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తక్కువ ప్రెజర్‌తో నీరు సరఫరా అయినా.. లేదా నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా.. తమకు దగ్గర్లోని సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలని అధికారులు తెలిపారు. లేదా జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని.. వాటిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుని సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు.














Leave a Reply