ఆల్మ‌ట్టి డ్యామ్ ఎత్తును పెంచితే తెలుగు రాష్ట్రాల‌కు తీవ్ర న‌ష్టం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, న‌వంబ‌ర్ 20, అద్దం న్యూస్ :    కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మించిన ఆల్మట్టి డ్యామ్ ఎత్తును ఏకపక్షంగా పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పూర్తి స్థాయిలో అన్యాయమని, ఇది రైతుల జీవనాధారానికి పెను ప్రమాదమని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు పి.సాయిబాబా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… ఇప్పటికే కృష్ణా నది జలాల వివాదం కొనసాగుతున్న తరుణంలో, కర్ణాటక నిర్ణయం వల్ల దక్షిణ తెలంగాణ ప్రాంతంలో సాగునీటితో పాటు తాగునీటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందన్నారు. ఆల్మట్టి ఎత్తును పెంచడం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలు దెబ్బతింటాయని, పాలమూరు బతుకులు ఎడారిగా మారే ప్రమాదముందని అన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును ప్రస్తుతం ఉన్న 519 మీటర్ల నుండి 524 మీటర్ల ఎత్తుకు పెంచాలని నిర్ణయించడం అత్యంత దురదృష్టకరమైన చర్య అని అన్నారు. ఈ ప్రతిపాదన కేవలం ఆలోచన దశలో మాత్రమే కాక, కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన డీపీఆర్ ( Detailed Project Report ) ను సిద్ధం చేయడంతో పాటు, టెండర్లను కూడా ఖరారు చేసిందన్నారు. దీంతో తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోందన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు కర్ణాటకలోని ధార్వాడ, బాగల్ కోట్ జిల్లాల సరిహద్దుల్లో నిర్మితమై ఉన్నందున, దిగువ రాష్ట్రమైన తెలంగాణకు కృష్ణా జలాల ప్రవాహం గతంలోనే తగ్గిందన్నారు. తాజాగా డ్యామ్ ఎత్తును పెంచడం ద్వారా మరింత ఎక్కువ జలాలను కర్ణాటక తమ వద్ద నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తోందని, ఎత్తు పెంచితే, కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని సాగుభూములకు నీటి ఎద్దడి ఏర్పడి ప్రధానంగా యాసంగి ( రబీ ) పంటలకు నీరు నిలిచిపోయి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారని, తాగునీటికి కూడా ప్రమాదమని పేర్కొన్నారు.

తెలంగాణలోని దక్షిణ ప్రాంత సాగునీరు, తాగునీటి భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసే ఈ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి మౌనం వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ సంక్షోభం వెనుక రాజకీయ కుమ్మక్కుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయన్నారు. ఇటీవల కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే అధికారంలోకి రావడం, ఇరువురు కుమ్మకై ప్రాజెక్టు ఎత్తును పెంచాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోందని సాయిబాబా ఆరోపించారు. ఒకే రాజకీయ నేతృత్వంలో ఉండడం వలన, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ సమన్వయానికి ప్రాధాన్యత ఇస్తుందనే విమర్శలు తలెత్తుతున్నాయన్నారు. కీలకమైన ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాని, ముఖ్యమంత్రి కాని, మంత్రులు కాని స్పందించకపోవడం చాలా దౌర్భాగ్యకరం, తెలంగాణ రైతులకు చేస్తున్న ద్రోహమన్నారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా, రాష్ట్ర హక్కులను పణంగా పెట్టి, “ఢిల్లీకి కప్పం కట్టడమే” తమ ప్రథమ కర్తవ్యంగా వ్యవహరిస్తున్నారని సాయిబాబా విమర్శించారు. గతంలో కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే ప్రతిపాదన తెచ్చినప్పుడు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పూర్తిగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేసి, తన రాజకీయ పోరాటం ద్వారా ఆ ప్రతిపాదనను విరమించుకునేలా చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన అలుపెరగని పోరాట ఫలితంగానే ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రతిపాదన అప్పటికి ఆగిపోయిందన్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులను కాపాడాలని సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షులు సాయిబాబా డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీసుకువచ్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం మాటలతో కాకుండా, తక్షణమే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి, డీపీఆర్, టెండర్ల ప్రక్రియను నిలిపివేయించి, ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రతిపాదనను శాశ్వతంగా విరమించుకునేలా చేయాలని కోరారు. లేనిపక్షంలో జరిగే అన్యాయానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page