ఇంగ్లాండ్ కొత్త కోచ్‌గా టీమిండియా మాజీ హెడ్ కోచ్..?

ఇంగ్లాండ్ కొత్త కోచ్‌గా టీమిండియా మాజీ హెడ్ కోచ్..?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర ఓటమి ఇంగ్లాండ్ క్రికెట్లో పెను భూకంపాన్ని సృష్టిస్తోంది. కేవలం 11 రోజుల్లోనే 3-0తో సిరీస్‌ను కోల్పోవడంతో ప్రస్తుత హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిని ఇంగ్లాండ్ కోచ్‌గా నియమించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

రవిశాస్త్రి వైపు మొగ్గు చూపుతున్న మాజీలు

ఇంగ్లాండ్ జట్టుకు కొత్త ఆలోచనా విధానం అవసరమని మాజీ ఇంగ్లీష్ స్పిన్నర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టును ఎలా ఓడించాలో రవిశాస్త్రికి బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు. “ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై మానసికంగా, శారీరకంగా, వ్యూహాత్మకంగా ఎలా దెబ్బతీయాలో తెలిసిన వ్యక్తి కావాలి. రవిశాస్త్రికి ఆ అనుభవం ఉంది. ఆయనే ఇంగ్లాండ్ తదుపరి హెడ్ కోచ్ కావాలని నేను భావిస్తున్నాను.” ఆయన పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా.. ఆస్ట్రేలియాలో రవిశాస్త్రి సాధించిన విజయాలు అసాధారణం. ఆయన పర్యవేక్షణలో భారత జట్టు ఆస్ట్రేలియాలో రెండు చారిత్రాత్మక టెస్ట్ సిరీస్‌లను గెలుచుకుంది. 2018-19లో 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2020-21లో 2-1తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ రికార్డులే ఇప్పుడు రవిశాస్త్రిని ఇంగ్లాండ్ కోచ్ రేసులో నిలబెడుతున్నాయి.

విఫలమైన ‘బాజ్‌బాల్’ వ్యూహం..

బ్రెండన్ మెకల్లమ్ ప్రవేశపెట్టిన దూకుడుగా ఆడే ‘బాజ్‌బాల్’ విధానం ఆరంభంలో విజయాలను అందించినా, కీలకమైన సమయాల్లో విఫలమవుతోంది. 2024 నుంచి ఇంగ్లాండ్ 12 టెస్టుల్లో గెలిచి, 13 టెస్టుల్లో ఓడిపోయింది.

తన భవిష్యత్తుపై మెకల్లమ్ ఏమన్నారంటే?..

తన పదవి గురించి వస్తున్న వార్తలపై మెకల్లమ్ స్పందిస్తూ.. అది తన చేతుల్లో లేదని తేల్చి చెప్పారు. “నా పని నేను చేసుకుంటూ పోతాను. ఈ సిరీస్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం. కానీ నేను కోచ్‌గా కొనసాగుతానా లేదా అనేది నిర్ణయించాల్సింది మేనేజ్‌మెంట్” అని ఆయన పేర్కొన్నారు. మరి రవిశాస్త్రి నిజంగానే ఇంగ్లాండ్ కోచ్ బాధ్యతలు చేపడతారా అన్నది వేచి చూడాలి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page